FactCheck : ఓ వ్యక్తిని నడిరోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదుతున్న ఘటన ఏపీలో చోటు చేసుకున్నది కాదు

కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2023 9:35 PM IST
FactCheck : ఓ వ్యక్తిని నడిరోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదుతున్న ఘటన ఏపీలో చోటు చేసుకున్నది కాదు

కొందరు వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వీడియోలోని వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు కొడుతూ కనిపించారు.. కొందరు తన్నడం, ఇంకొకరు చెంపదెబ్బలు కొట్టడాన్ని మనం చూడొచ్చు.


ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఒక వ్యక్తిపై దాడి చేశాడని చెబుతూ వీడియోను షేర్ చేస్తున్నారు.

నిజ నిర్ధారణ :

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్నది కాదు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జరిగినట్లుగా న్యూస్‌మీటర్ గుర్తించింది.

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యక్తిగత సహాయకుడు భాస్కర్.. ఓ వ్యక్తిపై దాడి చేశాడని.. X వినియోగదారు పోస్ట్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కూడా నెటిజన్లు పేర్కొన్నారు.

మేము జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) పి రవీంద్ర ప్రసాద్‌ను సంప్రదించాము. జూబ్లీహిల్స్‌లో ఈ సంఘటన జరిగిందని ధృవీకరించారు.

“అక్టోబర్ 7-8 మధ్య రాత్రి సుమారు 2 గంటలకు, భాస్కర్, లలిత్ తో సహా ఐదుగురు వ్యక్తులు చందుతో వాగ్వాదానికి దిగారు, ఇది గొడవకు దారితీసింది. చందుపై ఇతరులు దాడి చేయడాన్ని వీడియోలో చిత్రీకరించారు. ఐపీసీ సెక్షన్ 307 కింద సుమోటో కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేశారు, మిగిలిన ముగ్గురు నిందితుల కోసం వెతుకుతున్నాం." అని తెలిపారు.

భాస్కర్ ప్రస్తుత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు పీఏగా పనిచేస్తున్నారా అని ప్రశ్నించగా.. భాస్కర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి చెందిన సాధారణ కార్యకర్త, ప్రస్తుత ఎమ్మెల్యేకు పీఏ కాదని ప్రసాద్ తెలిపారు.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్యాక్ట్-చెక్ X హ్యాండిల్ కూడా ఇది తప్పుడు వార్తలని తెలిపింది. నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారని.. ఈ వీడియో తెలంగాణకు చెందినదని.. ఆంధ్రప్రదేశ్ కు చెందినది కాదని వివరణ ఇచ్చింది.


కాబట్టి, హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటనను ఏపీలో చోటు చేసుకుందని ప్రచారం చేస్తున్నారు.

Credits : Md Mahfooz Ali

Claim Review:ఓ వ్యక్తిని నడిరోడ్డుపై విచక్షణారహితంగా చితకబాదుతున్న ఘటన ఏపీలో చోటు చేసుకున్నది కాదు
Claimed By:X User
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:False
Next Story