FactCheck : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో బీహార్ రాష్ట్రానికి సంబంధించినది

నలుగురు పిల్లలు డ్రగ్స్ తాగుతున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Jan 2024 7:50 PM IST
FactCheck : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో బీహార్ రాష్ట్రానికి సంబంధించినది

నలుగురు పిల్లలు డ్రగ్స్ తాగుతున్నట్లు చూపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో ఆంధ్రప్రదేశ్‌కి చెందినది అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఆడియో కూడా ఉంది. “చిన్న పిల్లలు గంజాయికి బానిసలు అవుతున్నారు. నేను నా కళ్లతో చూశాను. నేను ఒక నియోజకవర్గాన్ని సందర్శించినప్పుడు, ఒక తల్లి తన పదవ తరగతి కుమార్తె గంజాయికి బానిస అవుతుందనే భయాన్ని వ్యక్తం చేసింది. చిన్న పిల్లల జీవితాలు నాశనం అవుతూ ఉన్నాయి" అని ఆ ఆడియోలో ఉంది.

నిజ నిర్ధారణ :

ఆ వీడియో బీహార్‌కి చెందినదని న్యూస్‌మీటర్ కనుగొంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వీడియోలోకి తెలుగు ఆడియోను డిజిటల్‌గా జోడించారు.

వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. జనవరి 9, 2024న ప్రచురించిన న్యూస్ 18 హిందీ నివేదికలో కవర్ ఇమేజ్‌ ను గుర్తించాం. వీడియోకు సంబంధించినస్క్రీన్ షాట్ లను ఉపయోగించారని మేము కనుగొన్నాము. ఈ వీడియో బీహార్‌లోని పాట్నా జంక్షన్ వెలుపల రికార్డ్ చేయబడిందని నివేదిక పేర్కొంది. రైల్వే స్టేషన్‌లోని పార్కింగ్‌ దగ్గర నలుగురు పిల్లలు డ్రగ్స్‌ సేవిస్తున్నట్లు అందులో ఉంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Bihari Larka అనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో వీడియోను షేర్ చేశారు. జనవరి 7న అప్లోడ్ చేసిన వీడియోలో పొడవైన వెర్షన్‌ను గుర్తించాం, పాట్నా జంక్షన్ వెలుపల పిల్లలు డ్రగ్స్ తాగుతున్నట్లు వీడియో క్యాప్షన్‌లో పేర్కొన్నారు. పాట్నా జంక్షన్ వెలుపల ఉన్న హనుమాన్ మందిర్ పక్కన ఉన్న పార్కింగ్ దగ్గర వీడియోను రికార్డు చేశారని గుర్తించాం. ఈ వీడియోలో రైల్వే స్టేషన్‌లో వచ్చే ప్రకటనలకు సంబంధించిన ఆడియో కూడా ఉంది.

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ వింగ్ అధికారిక ఖాతా కూడా ఇది ఫేక్ పోస్ట్ అని స్పష్టం చేసింది. అసలు వీడియో బీహార్‌కి చెందినదని స్పష్టం చేసింది.

“బీహార్‌లోని పాట్నాకు చెందిన కొంతమంది పిల్లల వీడియో ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్నదిగా తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అసలు వీడియో పాట్నా జంక్షన్ కు సంబంధించింది. నకిలీ వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలి. " అంటూ హెచ్చరిస్తూ ఓ పోస్టు పెట్టింది.

అందువల్ల, పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్న వైరల్ వీడియో బీహార్‌లోని పాట్నాకు చెందినది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది కాదని మేము నిర్ధారించాము.

Credits : Md Mahfooz Alam

Claim Review:ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో బీహార్ రాష్ట్రానికి సంబంధించినది
Claimed By:X User
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X
Claim Fact Check:Misleading
Next Story