నీలిరంగు కుర్తా పైజామా ధరించిన చిన్నారి కాళ్లను తాడుతో కట్టి తలకిందులుగా వేలాడదీస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో పలువురు పిల్లలు స్కల్ క్యాప్ ధరించి ఉన్నారు. అందులోని వాళ్లు ఖురాన్ చదువుతున్నట్లు మనకు కనిపిస్తుంది.
ఇండియాలోని మదర్సాలో ఒక అమ్మాయిని శిక్షిస్తున్నారనే వాదనతో వీడియోని వైరల్ చేస్తున్నారు.
“ఇది ఏ పాఠశాల అని నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చిన్న అమ్మాయిని ఇలా తలకిందులుగా కట్టేసినప్పుడు.. మనదేశంలో చట్టాలు ఉన్నాయనే భయం వారిలో ఉందా? ఈ తాలిబానీ శిక్షకు కారణం ఏమిటి. అటువంటి పాఠశాలలను భారతదేశం అంతటా పూర్తిగా నిషేధించాలని.. ఒక అమ్మాయిని ఇలా హింసించినందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.(హిందీ నుండి అనువాదం)" అనే వాదనతో వీడియోను షేర్ చేస్తున్నారు.
పలువురు ఫేస్ బుక్ యూజర్లు కూడా ఈ వీడియోను ఇదే వాదనతో షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
ఆ వీడియో పాకిస్థాన్‌కు చెందినదని.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని న్యూస్‌మీటర్ కనుగొంది.
వీడియో కీఫ్రేమ్స్ ను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించాము. జూన్ 30, 2019న పాకిస్తాన్ వార్తా సంస్థ జియో న్యూస్ ప్రచురించిన నివేదికలో వీడియోకు సంబంధించిన స్క్రీన్‌గ్రాబ్‌లను కనుగొన్నాము. “Rawalpindi ‘qari’ who assaulted student sent on 14-day judicial remand.” అనే టైటిల్ తో కథనాన్ని ప్రచురించారు.
వీడియో వైరల్ అవ్వగా.. పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని ధోక్ కశ్మీరియన్ ప్రాంతంలో విద్యార్థిని తలక్రిందులుగా కట్టేసిన ఖరీ నూర్ ముహమ్మద్‌ను సాదికాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నూర్ మహమ్మద్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు కూడా ఈ నివేదిక పేర్కొంది.
జూన్ 28, 2019న ది ట్రిబ్యూన్ ప్రచురించిన నివేదికలో కూడా మేము ఈ వీడియోను కనుగొన్నాము. విద్యార్థిని ఇలా వేధించిన నూర్ ముహమ్మద్‌ని ధోక్ కాశ్మీరియన్, సాదికాబాద్‌లోని సెమినరీ నుండి అరెస్టు చేసినట్లు తెలిపారు. బాధిత విద్యార్థితో పాటు అతని తండ్రిని విచారణ నిమిత్తం సాదికాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
నివేదిక ప్రకారం.. ఈ సంఘటన 2018 లో జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. సెమినరీ యాజమాన్యం, బాధితుల మధ్య సెటిల్మెంట్ జరగడంతో ఈ ఘటనలో నిందితులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తేలింది.
గల్ఫ్ టుడే, ఆరీ న్యూస్ కూడా అదే వాదనతో ఈ సంఘటనను నివేదించాయి.
భారత దేశంలోని మదర్సాలో ఒక అమ్మాయిని శిక్షించిన ఘటన ఇది కాదని మేము నిర్ధారించాము.