కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుని వచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా డిసెంబర్ 8న 'భారత్ బంద్' ను నిర్వహించడం జరిగింది. పలు రాష్ట్రాల్లో భారత్ బంద్ సక్సెస్ అయ్యింది.
ఇలాంటి సమయంలో బరాక్ ఒబామాకు సంబంధించిన ఓ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒబామా కరచాలనం ఇస్తున్న ఫోటో అది. ఆ ఫోటో పైన ఒబామా ట్వీట్ చేసినట్లుగా 'ఈ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు సిగ్గుపడుతున్నా' అని ఉంది. నరేంద్ర మోదీ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు చాలా సిగ్గు పడుతూ ఉన్నానన్నది ఆ ట్వీట్ సారాంశం.
చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఈ పోస్టును షేర్ చేస్తూ ఉన్నారు. రైతులకు మద్దతుగానే ఒబామా ట్వీట్ చేశారని చెబుతూ ఉన్నారు.
"Today I am shameful for a handshake with this man...... #narendramodi" అంటూ ఉన్న ట్వీట్ ను బరాక్ ఒబామా డిసెంబర్ 5న చేసినట్లుగా ఉంది.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.
బరాక్ ఒబామా ట్విట్టర్ అకౌంట్ ను పరిశీలించగా ఇలాంటి ట్వీట్ ను అధికారిక ఖాతా నుండి పోస్టు చేసినట్లుగా కనిపించలేదు.
వైరల్ అవుతున్న పోస్టులో ట్వీట్ వేసింది డిసెంబర్ 5, 2020న అని ఉంది. ఒబామా అధికారిక ఖాతాలో డిసెంబర్ 5న కేవలం రెండే రెండు ట్వీట్లు ఉన్నాయి. వాటిని వైరల్ అవుతున్న పోస్టుకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
డిసెంబర్ 5న ఒబామా చేసిన ట్వీట్స్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను గమనించవచ్చు.
�
వైరల్ అవుతున్న పోస్టులో ఎన్నో వ్యాకరణ దోషాలను గుర్తించవచ్చు. సాధారణంగా ట్విట్టర్ పోస్టుతో పోలిస్తే వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో ఉన్న డేట్, టైమ్ కు సంబంధించిన ఫార్మాట్ వేరే విధంగా ఉంది.
కాబట్టి, వైరల్ అవుతున్న ఫోటో మార్ఫింగ్ చేసినదని తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు సిగ్గుపడుతున్నానని బరాక్ ఒబామా ఎటువంటి ట్వీట్ చేయలేదు.
India Today, Alt news మీడియా సంస్థలు కూడా ఈ పోస్ట్ ను ఫేక్ అంటూ తేల్చాయి.
కాబట్టి వైరల్ అవుతున్న పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.