భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు, రాష్ట్రపతి భవన్‌లో మాంసాహార విందులను నిషేధిస్తూ కొత్త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పలు సోషల్ మీడియా సైట్స్ లో ఇందుకు సంబంధించిన పోస్టులను అప్లోడ్ చేశారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం ఈ నిషేధాజ్ఞలకు సంబంధించిన వార్తల కోసం ఆన్‌లైన్‌లో శోధించింది. అయితే రాష్ట్రపతి భవన్‌లో మాంసాహార విందులు నిషేధించబడినట్లు ఎటువంటి నివేదికలు కనుగొనబడలేదు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అటువంటి నిషేధాన్ని ఆదేశించినట్లయితే.. తప్పకుండా మీడియా ద్వారా నివేదించబడుతుంది. దీనిపై ఎటువంటి వార్తా నివేదికలు లేకపోవడం ఆ వాదన తప్పు అని రుజువు చేస్తుంది.
భారత రాష్ట్రపతి శాఖాహారి అని.. వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినరని కూడా గమనించాలి. ది ప్రింట్, NDTV ప్రకారం.. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా, అతిథులకు శాఖాహార భోజనం అందించారు. మెనూలో స్వీట్‌కార్న్ వెజిటబుల్ సూప్, పాలక్ పనీర్, దాల్ తడ్కా, గోబీ గజర్ బీన్స్, మలై కోఫ్తా, జీరా పులావ్, నాన్, తాజా గ్రీన్ సలాడ్, బూందీ రైతా, కేసర్ రస్మలై.. తాజా పండ్లు ఉన్నాయి.
రాష్ట్రపతి ముర్ము శాకాహారి అయినందున రాష్ట్రపతి భవన్‌లో మాంసాహారంపై నిషేధం గురించి నెటిజన్లు ఇలాంటి పోస్ట్‌ను పంచుకునే అవకాశం ఉంది. PIB ఫ్యాక్ట్ చెక్ కూడా క్లెయిమ్ తప్పు అని నిర్ధారించింది. రాష్ట్రపతి భవన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.
రాష్ట్రపతి భవన్‌లో మాంసాహార విందులను నిషేధిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీ చేశారన్న వాదన అవాస్తవమని స్పష్టంగా తెలుస్తోంది.