భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్న సంగతి తెలిసిందే..! భారతదేశంలో కరోనా ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చింది. కొత్తగా 3,46,786 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. అదే సమయంలో 2,19,838 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య1,66,10,481 కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 2,624 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,89,544 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,38,67,997 మంది కోలుకున్నారు. 25,52,940 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 13,83,79,832 మందికి వ్యాక్సిన్లు వేశారు.
ఇటీవలి కాలంలో రోజుకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతూ ఉండడంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ఇలాంటి సమయంలో టీవీ9 భరతవర్ష్ కు సంబంధించిన న్యూస్ బులిటెన్ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో మోదీ మాట్లాడుతూ ఉండగా.. భారత్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తున్నట్లుగా స్క్రీన్ మీద రాశారు.
నిజ నిర్ధారణ:
ఏప్రిల్ 7, 2021 న టీవీ9 భరతవర్ష్ లో ఇలా వచ్చిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
ఆ సమయంలో వచ్చిన న్యూస్ బులిటెన్ లో మహారాష్ట్రలో పెరిగిపోతున్న కరోనా కేసుల గురించి చర్చించారు.. లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉందని తెలిపారు.
అందులో మహారాష్ట్ర అనే పదాలను తొలగించి.. భారత్ అనే పదాలను ఉంచారు. ఆ తర్వాత స్క్రీన్ షాట్ ను తీసి ఉంచారు.
రెండు ఫోటోలకు మధ్య ఉన్న తేడాలను కింద గమనించవచ్చు.
వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో మోదీ ఉన్న ఫోటోను Bengaluru Technological Summit 2020 లో భాగంగా మోదీ ఇచ్చిన స్పీచ్ నుండి తీసుకున్నారు. ఆ వర్చువల్ స్పీచ్ ను మోదీ నవంబర్ 19 న ఇచ్చారు.
ఇటీవల భారత ప్రధాని దేశ ప్రజలతో మాట్లాడి.. లాక్ డౌన్ అన్నది ఆఖరి అస్త్రం అని చెప్పారు. మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కరోనాను కట్టడి చేయాలని తెలిపారు.
https://theprint.in/india/no-need-for-lockdowns-if-all-follow-covid-protocols-says-pm-modi-in-address-to-nation/643094/
భారతదేశంలో మరోసారి లాక్ డౌన్ ను అమలు చేయబోతున్నామంటూ ఏప్రిల్ 7, 2021 న టీవీ9 భరతవర్ష్ లో వచ్చినట్లుగా వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.