కుటుంబంలో వివాదాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వీడియోలో ఓ వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని సోషల్ మీడియా వినియోగదారులు పేర్కొన్నారు.
ఒక ఎక్స్ వినియోగదారు వీడియోను 'పాకిస్థానీ జిహాదీ తన సొంత కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ అమ్మాయి తన పరువు కాపాడుకోవడానికి తన తల్లి దగ్గరకు పరిగెత్తినప్పుడు, ఆమె తండ్రి కూతుర్ని, ఆమె తల్లిని చంపడానికి రైఫిల్‌ని తీసుకున్నాడు. ఆ చిన్నారిని చూసి జాలిపడుతున్నాను’. అంటూ పోస్టు చేశారు.
పలువురు సోషల్ మీడియా యూజర్లు ఇదే వాదనతో వీడియోను పోస్టు చేశారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం ఈ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా గుర్తించింది.
మేము వైరల్ వీడియోకు సంబంధించిన కొన్ని కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించాము. అదే వీడియో కీఫ్రేమ్‌లను కలిగి ఉన్న అనేక నివేదికలను కనుగొన్నాము.
Express.pk నివేదిక ప్రకారం, 'పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో కుటుంబంలో వచ్చిన వివాదం కారణంగా భార్యపై తుపాకీని ఎక్కుపెట్టినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు' అని ఉంది.
“ఇంట్లో గొడవల సమయంలో నిందితుడు తన భార్యపై కలాష్నికోవ్ తుపాకీని ఎక్కుపెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత నిందితుడిపై సౌత్ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది” అని నివేదిక పేర్కొంది.
aajtv మరొక నివేదిక కూడా 'ఇంట్లో వివాదం కారణంగా తన భార్యను చంపడానికి కలాష్నికోవ్‌ను ఎక్కు పెట్టిన భర్తను లాహోర్‌లోని సౌత్ కంటోన్మెంట్ ప్రాంతంలో అరెస్టు చేశారు' అని తెలిపింది.
కాబట్టి, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించలేదని, ఇది కుటుంబ కలహాల కారణంగా జరిగిన గొడవ అని మేము నిర్ధారించాము.
Credits : Abrar Bhat