భారతదేశంలో ఆక్సిజన్ అందక కరోనా రోగులు ఆసుపత్రుల్లో మరణిస్తున్న సంగతి తెలిసిందే..! అయితే చాలా మంది ప్రజలు రోడ్ల మీదనే కుప్పకూలి మరణిస్తూ ఉన్నారంటూ న్యూ యార్క్ పోస్టు ఓ కథనాన్ని ప్రచురించింది. ఏప్రిల్ 26, 2021న ఆ పోస్టు పెట్టి.. ఓ మహిళ వీధిలోనే పడిపోయిన ఫోటోను పోస్టు చేశారు.
భారతదేశాన్ని కరోనా మహమ్మారి మింగేస్తూ ఉంది అంటూ అందులో చెప్పుకొచ్చారు. భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తూ ఉండగా.. ఇంటర్నేషనల్ మీడియా కూడా భారత్ లో కరోనా కేసుల గురించి పెద్ద ఎత్తున రిపోర్టింగ్ చేస్తూ ఉంది.
నిజ నిర్ధారణ:
న్యూ యార్క్ పోస్టు సంస్థ అప్లోడ్ చేసిన ఈ ఫోటోకు.. భారతదేశంలో కరోనా మరణాలకు ఎటువంటి సంబంధం లేదు. రోడ్డు మీద కుప్పకూలిన మహిళకు సంబంధించిన ఫోటో 2020లో వైజాగ్ గ్యాస్ లీక్ కు సంబంధించినది. ఈ ఫోటోకు ప్రస్తుతం దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితులకు సంబంధం లేదు. తప్పు తెలుసుకున్న న్యూ యార్క్ పోస్టు ఆర్టికల్ ను అప్డేట్ చేయడమే కాకుండా.. హెడ్ లైన్ ను మార్చి.. ఫోటోను మార్చేసింది.
న్యూయార్క్ పోస్టు అప్లోడ్ చేసిన ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. అందులో ఉన్నది వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనకు చెందినది. విశాఖపట్నం లోని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామం వద్ద మే 2020లో ఎల్.జీ. పాలిమర్స్ కెమికల్ ప్లాంట్ గ్యాస్ లీక్ ఘటనకు చెందినది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా.. 1000 మందికి పైగా గ్యాస్ పీల్చడం వలన స్పృహ తప్పి పడిపోయారు.
న్యూయార్క్ పోస్టు అప్లోడ్ చేసిన ఫోటోలో వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనకు చెందినదే..! ఈ ఫోటో అప్లోడ్ చేశాక.. న్యూయార్క్ పోస్టును తప్పుబడుతూ పలువురు సోషల్ మీడియా యూజర్లు పోస్టులు పెట్టారు. ప్రజలను తప్పుద్రోవ పట్టించే విధంగా ఉందని తెలిపారు. దీంతో న్యూయార్క్ పోస్టు సంస్థ ఫోటోను వెంటనే తీసివేసింది. ఆ తర్వాతా కొద్దిసేపటికి హెడ్ లైన్ ను కూడా మార్చింది.
న్యూ యార్క్ పోస్టు సంస్థ అప్లోడ్ చేసిన ఈ ఫోటోకు.. భారతదేశంలో కరోనా మరణాలకు ఎటువంటి సంబంధం లేదు. 2020 మేలో జరిగిన వైజాగ్ గ్యాస్ లీక్ ఘటనకు చెందినది.