ఫుట్ బాల్ దిగ్గజం డియాగో మారడోనా ఇటీవలే మరణించారు. ఆయన మరణవార్త క్రీడా దిగ్గజాలను కలచివేసింది. బ్రెజిల్ ఫుట్ పాల్ దిగ్గజం పీలే కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇంతలో సామాజిక మాధ్యమాల్లో ఓ ఫోటో వైరల్ అవుతూ ఉంది. మారడోనా సమాధి వద్దకు వెళ్లిన పీలే బాధతో ఉన్న ఫోటో అది.
"Ultimate Farewell...Pele's bow to Maradona...Peaking Silently..!!" అంటూ ట్విట్టర్ యూజర్లు వీడియోను పోస్టు చేశారు.
మారడోనాకు పీలే నివాళులు అర్పిస్తున్న ఫోటో అంటూ పలువురు షేర్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
న్యూస్ మీటర్ ఈ ఫోటోపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇలాంటి ఫోటోను పాశ్చాత్త్య దేశాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించే ఎన్నో వెబ్సైట్స్ తమ ప్రొఫైల్ లో ఉంచుకున్నాయి. Clay Barnette, Corey-Kerlin అనే వెబ్సైట్లలో కూడా అచ్చం అలాంటి ఫోటోనే చూడొచ్చు. ఇదొక కేవలం రిప్రెజెంటేషనల్ ఫోటో అని గుర్తించవచ్చు.
ఓ సమాధి ముందు వ్యక్తి బాధను వ్యక్తం చేస్తూ ఉన్న ఫోటోకు మార్ఫింగ్ చేసి పీలే ముఖాన్ని ఉంచారు. స్టాక్ ఫోటోలో ఆ వ్యక్తి పట్టుకున్న పూలు, కూర్చున్న విధానం అన్నీ ఒకేలా ఉన్నాయి. ఒరిజినల్ ఫోటోలో సమాధి మీద పేరు లేదు.. వైరల్ ఫోటోలో మాత్రం పేరు ఉంది.
పీలే మారడోనా అంతిమ యాత్రకు హాజరవ్వలేదు కానీ.. ఓ గొప్ప సహచరుడిని కోల్పోయానని చెప్పుకొచ్చారు. 'ఇదొక బాధాకరమైన వార్త. గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ప్రపంచం ఓ లెజెండ్ ను కోల్పోయింది. అతడి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతి తెలుపుతూ ఉన్నాను.. ఓ రోజున ఇద్దరూ కలిసి పైన ఫుట్ బాల్ ఆడాలని అనుకుంటూ ఉన్నాను' అని పీలే ట్వీట్ చేశారు.
వైరల్ అవుతున్న ఫోటో నిజం కాదు. ఫోటోను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.