కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముందుకు సాగుతూ ఉంది. 15 రోజుల తర్వాత కేరళలోని త్రిస్సూర్‌లో సెప్టెంబర్ 23న వారు రెండవ విరామం తీసుకున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఉన్న ఫోటో వైరల్ గా మారింది. యాత్రలో భాగంగా గాంధీ బీఫ్ ఆస్వాదించారని పోస్టులు పెడుతున్నారు.
రాహుల్ గాంధీ పరోటా, బీఫ్ తింటున్నారంటూ ఓ ట్విటర్ యూజర్లు ఫొటోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ :
NewsMeter బృందం వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసింది. వైరల్ ఫోటోతో పోలి ఉన్న మరో ఫోటోను కనుగొంది. కానీ అందులో బీఫ్ కు సంబంధించిన ప్లేట్ లేదు. ఈ ఫోటోను కౌముది ఆన్‌లైన్ సెప్టెంబరు 17న ప్రచురించిన కథనంలో ప్రచురించింది. "రాహుల్ 'భారత్ జోడో యాత్ర' లో భాగంగా ఓ చిన్న స్టాల్‌లో టీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు, దుకాణదారుడు, అతడి కుటుంబంతో కలిసి ఫోటోను దిగారు" అని ఉంది. ఉదయం టీ బ్రేక్ కోసం రాహుల్ గాంధీ అకస్మాత్తుగా వల్లికీజులోని ఓ టీ స్టాల్‌కి వెళ్లారని అందులో పేర్కొన్నారు. రాహుల్ పరోటాతో పాటూ.. బ్లాక్ టీ తాగారు. టీ స్టాల్ యజమాని కుటుంబంతో ఫోటోలు దిగారు.
సెప్టెంబరు 17న మనోరమ మీడియా సంస్థ ప్రచురించిన మలయాళ కథనంలో కూడా మేము అదే ఫోటోను కనుగొన్నాము. ఈ ఫోటోలో బీఫ్ కూడా లేదు. రాహుల్ గాంధీ బ్లాక్ టీ తాగేందుకు తమ దుకాణానికి రావడంతో హరికుమార్ దంపతులు ఆశ్చర్యానికి గురయ్యారని కథనంలో ఉంది. రాహుల్ వెంట ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్, కెపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోడికున్విల్ సురేష్, ఇతర కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
మీకు ఒరిజినల్ ఫోటోకు, మార్ఫింగ్ ఫోటోకు ఉన్న తేడాను తెలియజేయడానికి ఇక్కడ రెండింటినీ ఉంచాం. గమనించగలరు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బీఫ్ తిన్నారనే కథనాల్లో ఎటువంటి నిజం లేదు. మార్ఫింగ్ చేసిన ఫోటోను వైరల్ చేస్తున్నారు.