టీవీ9 మరాఠీ ఛానల్ లోగో ఉన్న స్క్రీన్ షాట్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ స్క్రీన్ షాట్ లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఉన్నారు. ఉద్ధవ్ థాక్రే 15 రోజుల పాటూ మహారాష్ట్రలో కఠిన లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారంటూ ఆ వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో ఉంది. రాష్ట్రంలో పెరిగిపోతున్న కరోనా కేసులను కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఈ పోస్టును వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
మహారాష్ట్రలో సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేస్తూ థాక్రే ప్రకటన చేశారనే వార్తల కోసం వెతకగా ఎక్కడ కూడా అందుకు సంబంధించిన సమాచారం కనిపించలేదు. మహారాష్ట్రలో పూర్తిగా లాక్ డౌన్ ను విధిస్తూ ఎటువంటి ప్రకటన ఆ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నుండి రాలేదు.
ఫిబ్రవరి 21న ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ పరిస్థితి ఇలానే ఉంటే రాష్ట్ర వ్యాప్త లాక్‌డౌన్‌పై ఆలోచిస్తామని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్‌డౌన్ వద్దనుకుంటే కనుక ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని సీఎం హితవు పలికారు. రానున్న 8-15 రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇలానే పెరిగితే... ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. మారో సారి లాక్‌డౌన్ విధించాలని మీరు కోరుకుంటున్నారా. మీరు ఇంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. లాక్‌డౌన్ తప్పదు అని థాకరే చెప్పుకొచ్చారు. వద్దనుకున్నవారు మాస్క్ ధరించండి.. లాక్‌డౌన్ కావాలి అనుకునే వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. కాకపోతే మీ వల్ల అందరు ఇబ్బంది పడతారనే విషయం గుర్తించాలని కటవుగా వ్యాఖ్యలు చేశారు. అంతే తప్పితే లాక్ డౌన్ ను అమలు చేస్తున్నామని చెప్పలేదు.
ఇక టీవీ9 మరాఠీకి సంబంధించి మార్చి 22, 2020న ట్వీట్ ను గమనించవచ్చు. ఆ ట్వీట్ నే ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఒరిజినల్ పోస్టుకు ఎడిట్ చేసిన పోస్టుకు సంబంధించిన తేడాలను గమనించవచ్చు.
మార్చి 1 నుండి మహారాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేయబోతున్నామంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. వైరల్ అవుతున్న పోస్టు ఎడిట్ చేసినది.