జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సెప్టెంబరు 20న శ్రీనగర్‌లో కశ్మీర్ లో మొదటి మల్టీప్లెక్స్ థియేటర్‌ను ప్రారంభించిన తర్వాత, అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు S.S రాజమౌళి యాక్షన్ డ్రామా 'RRR' 1947 తర్వాత కశ్మీర్‌లోని సినిమా థియేటర్లలో ప్రదర్శించబడిన మొదటి చిత్రం అని పేర్కొన్నారు.
లిప్‌టైమ్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ జమ్మూ కశ్మీర్ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టమని పేర్కొంది.
పలువురు ఫేస్‌బుక్ వినియోగదారులు కూడా ఇదే వాదనను వినిపించారు.
మిర్చి ప్లస్ అనే వెబ్‌సైట్ "RRR 1947 తర్వాత కశ్మీర్ సినిమా హాళ్లల్లో ఆడిన మొదటి చిత్రం" అనే శీర్షికతో కథనం ప్రచురించింది.
నిజ నిర్ధారణ :
NewsMeter కీవర్డ్ సెర్చ్ ను నిర్వహించింది. WION ప్రచురించిన కథనాన్ని కనుగొంది. "మూడు దశాబ్దాల తర్వాత, సినిమా కశ్మీర్‌కు తిరిగి వస్తుంది; సెప్టెంబర్‌లో మొదటి మల్టీప్లెక్స్ ప్రారంభమవుతోంది." అని కథనం తెలిపింది. 90లలో కశ్మీర్‌లో దాదాపు 15 సినిమా హాళ్లు ఉండేవి. అయితే ఉగ్రవాదం వ్యాప్తి చెందడంతో అవి మూసివేయబడ్డాయి.
ఫస్ట్‌పోస్ట్ కథనంలో పెరుగుతున్న తీవ్రవాదం కారణంగా సినిమా హాళ్లను టార్గెట్ చేశారని తెలిపారు. అల్లా టైగర్స్ అనే తీవ్రవాద సంస్థ 1989లో స్థానిక వార్తాపత్రికల ద్వారా థియేటర్లు, బార్‌లపై నిషేధాన్ని ప్రకటించిందని తెలిపింది. కొన్ని థియేటర్‌లకు నిప్పు పెట్టారు.
ఈ కథనం కశ్మీర్‌లోని సినిమా హాళ్ల చరిత్రను వివరించే గ్రాఫిక్‌ను కూడా కలిగి ఉంది. ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం 1999లో మూడు సినిమా హాళ్లను తిరిగి తెరవడానికి ప్రయత్నించిందని పేర్కొంది. అయితే ఫస్ట్ షో సమయంలో ఉగ్రదాడి జరగడంతో థియేటర్లు మూతపడ్డాయి.
భారతీయ సినిమా థియేటర్ చైన్ ఐనాక్స్‌తో కలిసి విజయ్ ధర్ కశ్మీర్ లోయలో సినిమా సంస్కృతిని పునరుద్ధరించడానికి మొదటి అడుగు వేశారని ఫోర్బ్స్ ఇండియా నివేదించింది. 32 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో తొలి మల్టీప్లెక్స్‌ను ప్రారంభించారు.
"సినిమా నా రక్తంలో ఉంది. కశ్మీర్‌లోని చలనచిత్ర పరిశ్రమ బహుశా దేశంలోనే అత్యంత పురాతనమైనది-1932లో మొదటి సినిమా కశ్మీర్ టాకీస్ [తరువాత పేరు మార్చబడింది] శ్రీనగర్‌లో స్థాపించబడింది. బాంబే టాకీస్ 1934లో ప్రారంభమైంది. అంతే కాకుండా, మేము ఇక్కడ బ్రాడ్‌వే అనే సినిమాని నడిపేవాళ్ళం. అది బాగా ప్రాచుర్యం పొందింది, కానీ మూసి వేయాల్సి వచ్చింది" అని విజయ్ ధర్ ఫోర్బ్స్ ఇండియాతో అన్నారు.
కశ్మీర్‌లో 1932 నుంచి సినిమా హాళ్లు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది, అయితే 1990 తర్వాత తీవ్రవాదం పెరగడంతో లోయలోని సినిమా హాళ్లు మూతపడాల్సి వచ్చింది. కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.