సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. అందులో రైలు ఇంజిన్ చూపించారు. ఆ రైలు ఇంజిన్ మీద అదానీ గ్రూప్ కు సంబంధించిన ప్రకటన ఉంది. భారతీయ రైల్వేస్ కూడా అదానీ గ్రూప్ సొంతం అయ్యాయంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు.
భారతీయ రైల్వేను ప్రజలు తీర్చిదిద్దారని.. కానీ భారతీయ జనతా పార్టీ రైల్వేస్ ను ప్రైవేట్ పరం చేయడమే కాకుండా అదానీ గ్రూప్ కు దాన్ని కట్టబెట్టిందని పోస్టుల్లో చెప్పుకొచ్చారు. రాబోయే కాలంలో మోదీజీ కోటీశ్వరులైన స్నేహితులు రైల్వేలో పెద్ద ఎత్తున భాగస్వామ్యులు కాబోతున్నారని పోస్టుల్లో చెప్పుకొచ్చారు. రైతులు ఓ వైపు తమ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నా.. మోదీజీ వ్యవసాయాన్ని కూడా తన కోటీశ్వరులైన స్నేహితుల చేతుల్లోకి తీసుకుని వెళ్లాలని అనుకుంటూ ఉన్నారని విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
భారతీయ రైల్వేస్ ను అదానీ గ్రూప్ సొంతం చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఈ కథనాలకు సంబంధించి న్యూస్ మీటర్ ఏవైనా రిపోర్టులు దొరుకుతాయని వెతకగా ఎటువంటి రిజల్ట్స్ లభించలేదు. అధికారికంగా ఎటువంటి ప్రకటనలు కూడా కనిపించలేదు. ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి ధృవీకరణ కూడా లేదు. మీడియాలో కూడా ఇందుకు సంబంధించి ఎటువంటి కథనాలు కూడా రాలేదు.
వైరల్ వీడియోలో ఉన్న రైలును పరిశీలించగా "WR" "WAP-7" "BRC'' "30502." అనే సమాచారం కనిపిస్తుంది. కీ వర్డ్స్ సెర్చ్ కారణంగా "WR" అంటే వెస్ట్రన్ రైల్వేస్ (పశ్చిమ) అని తెలుస్తుంది. 'BRC/WAP-7/30502' అన్నది లోకోమోటివ్ నంబర్ ను తెలియజేస్తుంది. ఈ లోకోమోటివ్ వడోదర షెడ్ కు సంబంధించినదని స్పష్టమవుతోంది. ఇది కేవలం బ్రాండింగ్ లో భాగం మాత్రమేనని అదానీ విల్మార్ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది.
లోకోమోటివ్ బ్రాండింగ్ ద్వారా భారతీయ రైల్వేకు పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తూ ఉంటుంది. వైరల్ వీడియోలో ఫార్చూన్ ఆటాను అడ్వర్టైజ్మెంట్ లో భాగంగా ఉంచారు.
పిఐబి ఫ్యాక్ట్ చెక్ లో ఈ వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని చెప్పింది. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈ పోస్టులు ఉన్నాయని.. కేవలం కమర్షియల్ ప్రకటన మాత్రమేనని స్పష్టంగా తెలుస్తోంది.
భారతీయ రైల్వేస్ ను అదానీ గ్రూప్ సొంతం చేసుకుందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.