కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లులకు తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేపట్టారు. డిసెంబర్ 8వ తేదీన భారత్ బంద్ కు పిలుపును ఇచ్చారు.
ఇక సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ట్రాక్టర్లు రోడ్ల మీద వరుసగా ఉన్న వీడియో అది. జర్మనీ దేశంలోని డ్రెస్డెన్ లో ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతూ ఉన్నారు. భారత్ లోని రైతులకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారని వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.
జర్మనీ రైతులు భారత్ లోని రైతులకు సంఘీభావం చెబుతున్న వీడియో అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు.
హిందీ టీవీ ఛానల్ న్యూస్ 24 కూడా ఈ వీడియోను ప్రసారం చేసింది. జర్మనీ రైతులు భారత్ లోని రైతులకు మద్దతు తెలుపుతూ ఉన్న వీడియో ఇది అని చెబుతూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
ఈ వీడియోను నిశితంగా పరిశీలించగా.. రైతులు నిరసన తెలియజేస్తున్న ప్రాంతం జర్మనీ అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోను షూట్ చేస్తున్న వ్యక్తి మాటల ప్రకారం.. భారత్ లోని రైతులకు మద్దతుగా జర్మనీలో రైతులు కూడా సంఘీభావం చెబుతూ ఉన్నారని ఉంది. మోదీ ప్రభుత్వం ఇది చూస్తుందా లేదా అని కూడా ప్రశ్నించారు. అయితే జర్మనీ రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తోంది భారత రైతులకు మద్దతుగా కాదు..! అక్కడి మీడియా కథనాల ప్రకారం 'సాక్సోని రాష్ట్ర ప్రభుత్వం' తీసుకొచ్చిన సరికొత్త ఎరువుల నిబంధనలకు వ్యతిరేకంగా రైతులు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ వీడియోను రికార్డ్ చేస్తున్న వ్యక్తి మాటల ప్రకారం కీవర్డ్ సెర్చ్ చేయగా.. ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ రిపోర్ట్ జర్మన్ న్యూస్ అవుట్ లెట్ అయిన `Sachsische De' లో ఉంది. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్ అందులో ఉన్నాయి. "సాక్సోని రాష్ట్రానికి చెందిన వందల మంది రైతులు డ్రెస్డెన్ కు వచ్చారు.. సాక్సోని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ముందు రైతులు ట్రాక్టర్లతో వచ్చి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తగా తీసుకొచ్చిన ఫర్టిలైజర్ నిబంధనలు రైతులు ఒప్పుకోవడం లేదు." అంటూ కథనాల ద్వారా తెలియజేసారు. DW, Freie Presse రిపోర్టుల ప్రకారం కొత్త ఫర్టిలైజర్ నిబంధనల కారణంగా ఈ నిరసనలు చోటు చేసుకున్నాయని తెలిపారు.
జర్మనీకి చెందిన Correctiv.org అనే ఫ్యాక్ట్ చెక్ సంస్థ కూడా ఈ ఘటన డ్రెస్డెన్ లో చోటు చేసుకుందని ధృవీకరించింది.
జర్మనీ రైతులు భారత రైతులకు మద్దతుగా రోడ్ల మీద నిరసన కార్యక్రమం చేపట్టారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. సాక్సోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త ఎరువుల నిబంధనలకు వ్యతిరేకంగా రైతులు ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు.