ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని మార్పు చోటు చేసుకుందంటూ Nation TV అనే యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో ఉన్న వార్త ఏమిటంటే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి.. సమాజ్ వాదీ పార్టీలోకి చేరారు అని.
ఇది నిజామేనని నమ్మిన చాలా మంది సామాజిక మాధ్యమాల్లో షేర్లు చేస్తూ ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీలోకి చేరినందుకు కేశవ్ ప్రసాద్ మౌర్యకు శుభాకాంక్షలు అంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉండడాన్ని గమనించవచ్చు.
నిజ నిర్ధారణ:
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి.. సమాజ్ వాదీ పార్టీలోకి చేరారు అంటూ వైరల్ అవుతున్న వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.
ఈ వార్త గురించి న్యూస్ వెబ్సైట్స్ లో వెతకగా.. ఎటువంటి వార్త కూడా కనిపించలేదు. ఏ మీడియా సంస్థ కూడా కేశవ్ ప్రకాష్ మౌర్య తన పదవికి రాజీనామా చేశారని.. సమాజ్ వాదీ పార్టీలో చేరారని కథనాలు రాలేదు.
Nation TV అనే యూట్యూబ్ ఛానల్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియోను జూన్ 2న అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో కేశవ్ ప్రసాద్ మౌర్య బీజేపీని వదిలి.. సమాజ్ వాదీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి అన్నట్లుగా కథనాలు రాశారు. అంతే తప్పితే నిజంగా మారినట్లు తెలపలేదు. వీడియో థంబ్నైల్ ను ఆ తర్వాత మార్చారు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన ఫ్యాక్ట్ చెక్ హ్యాండిల్ కూడా ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. క్యాబినెట్ విషయంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదని తేల్చి చెప్పారు. సదరు యుట్యూబ్ ఛానల్ కథనంలో కూడా ఎటువంటి నిజం లేదని తేల్చారు.
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయలేదు. వైరల్ అవుతున్న స్క్రీన్ షాట్ లో 'ఎటువంటి నిజం లేదు'.