FactCheck : సోషల్ మీడియాకు బానిసలైన వాళ్లకు నెలకు 8500 ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారా.?

సోషల్ మీడియాకు బానిసలైన యువత బ్యాంకు ఖాతాల్లోకి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏటా లక్ష రూపాయలు (ప్రతి నెల రూ. 8,500) జమ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 April 2024 1:30 PM IST
FactCheck : సోషల్ మీడియాకు బానిసలైన వాళ్లకు నెలకు 8500 ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారా.?

సోషల్ మీడియాకు బానిసలైన యువత బ్యాంకు ఖాతాల్లోకి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏటా లక్ష రూపాయలు (ప్రతి నెల రూ. 8,500) జమ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లుగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ 24x7 చూసే పని చేస్తున్న సామాన్య యువత ఖాతాలకు ప్రతి నెలా ఆటోమేటిక్‌గా రూ. 8,500 వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది... టకాటక్... టకాటక్. #WealthRedistributionPlan," వీడియోను ప్రీమియం X ఖాతాలో షేర్ చేశారు.

“ Instagram, Facebook లాంటివి వాడుతూనే ఉండండి.. పదేసి పిల్లలకు జన్మనివ్వండి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, మధ్యతరగతి, సంపద సృష్టికర్తల జేబుల నుండి డబ్బు తీసుకొని ప్రతి ఒక్కరినీ లక్షాధికారులను చేస్తుంది." అంటూ మరో యూజర్ వీడియోను పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ :

సోషల్ మీడియాకు బానిసలు అయిన వారికి డబ్బులు ఇస్తానని రాహుల్ గాంధీ చెప్పలేదు. డిప్లొమాలు, గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగిన నిరుద్యోగ యువకులకు 'రైట్ టు అప్రెన్టైస్ షిప్' గురించి గాంధీ హామీ ఇచ్చినట్లు మేము కనుగొన్నాము.

మేము రాహుల్ గాంధీ యూట్యూబ్ ఛానెల్‌ని తనిఖీ చేసాము. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభ ఏప్రిల్ 20న ప్రత్యక్ష ప్రసారం చేసారు. వైరల్ వీడియో 12:40 నిమిషాల నుండి 12:55 నిమిషాల టైమ్‌స్టాంప్ లో ఉన్న క్లిప్ గా గుర్తించాం.

9:30 నిమిషాల టైమ్‌స్టాంప్ నుండి, గాంధీ మాట్లాడుతూ, “నరేంద్ర మోదీజీ భారతదేశాన్ని నిరుద్యోగ కేంద్రంగా మార్చారు. యువతను ఏమి చేస్తారు అని అడిగితే? ఏడెనిమిది గంటలపాటు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో బిజీబిజీగా ఉన్నామని చెబుతారు. ఎందుకు? ఎందుకంటే నరేంద్ర మోదీ ఈ దేశంలో ఎక్కడ చూసినా నిరుద్యోగాన్ని విస్తరింపజేశారు.

ధనవంతుల పిల్లలు ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ ద్వారా జాబ్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తారు.. అయితే నిరుద్యోగ యువతకు ఈ సదుపాయం అందుబాటులో లేకపోవడం రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. 11:00 నిమిషాల టైమ్‌స్టాంప్ వద్ద “ఫస్ట్ అష్యూర్డ్ జాబ్” (పెహ్లీ నౌక్రి పక్కి) పథకం గురించి మాట్లాడారు. ఈ పథకం కింద, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లందరికీ మేము అప్రెంటిస్‌షిప్ హక్కును అందిస్తామని తెలిపారు. ఎంఎన్‌ఆర్‌ఇజిఎ ఉపాధి హక్కును ఎలా కల్పించిందో, అదే హక్కును గ్రాడ్యుయేట్‌లకు వారి మొదటి ఉద్యోగానికి అందిస్తాం.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ “మొదటి ఉద్యోగానికి హక్కు అంటే గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లందరికీ ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ లభిస్తుంది, ఏటా రూ. 1 లక్ష (నెలకు రూ. 8,500) వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. వారు శిక్షణ పొందుతారు. వారి మొదటి సంవత్సరం బాగా చేస్తే, వారు పెర్మనెంట్ ఉద్యోగం పొందుతారు. ఈ అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాలు ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగాలలో అందుబాటులో ఉంటాయి. ఈ విధంగా, కోట్లాది మంది యువకులు శిక్షణ పొందుతారు. భారతదేశం శిక్షణ పొందిన శ్రామిక శక్తిని పొందుతుంది" అని అన్నారు. ఇప్పుడు ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్లకు అకౌంట్లలోకి డబ్బులు వస్తాయని చెప్పారు. అంతేకానీ సోషల్ మీడియాకు బానిస అయిన యువతకు డబ్బులు ఇస్తామని ఎక్కడా చెప్పలేదు రాహుల్ గాంధీ.


మేము 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా పరిశీలించాం. 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి డిప్లొమా హోల్డర్ లేదా గ్రాడ్యుయేట్‌కు ఒక ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ అవకాశాన్ని నిర్ధారిస్తూ అప్రెంటిస్‌షిప్ హక్కు చట్టాన్ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రూ.లక్ష వార్షిక ఉపకార వేతనం అందించనుంది.

అందువల్ల, వైరల్ వీడియో క్లిప్ ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము. తప్పుడు పోస్టులతో వీడియోను వైరల్ చేస్తున్నారు.

Credits : Md Mahfooz Alam

Claim Review:సోషల్ మీడియాకు బానిసలైన వాళ్లకు నెలకు 8500 ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారా.?
Claimed By:X and Facebook Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:X and Facebook
Claim Fact Check:Misleading
Next Story