టీ20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టు వరుస విజయాలను సాధిస్తూ వెళుతోంది. మొదటి మ్యాచ్ లో భారత్ ను ఓడించగా.. ఇప్పటికే న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లను ఓడించేసింది. సెమీ ఫైనల్ కు పాకిస్తాన్ దాదాపు వెళ్ళిపోయింది. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు భారత్ మీద విజయం సాధించడంతో ఆ దేశ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే పాక్ అభిమానులు టపాసులకు బదులుగా నిజమైన బాంబులు పేల్చారనే పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. పాక్ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకోడానికి చేసిన ప్రయత్నంలో నిజమైన బాంబులను పేల్చడంతో కొందరు పాకిస్తానీలు మరణించారని పోస్టులు పెడుతున్నారు.
"भारत को 10 विकेट से हराने कि खुशी में पटाखा कि जगह बम फोड़ने से पाकिस्तान में कई मरे और कई घायल," అంటూ పోస్టులు పెట్టారు. ఓ బాంబ్ బ్లాస్ట్ ఘటనకు సంబంధించిన ఫోటోను కూడా జోడించారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.
న్యూస్ మీటర్ వైరల్ పోస్టును గూగుల్ రివర్స్ సెర్చ్ చేయగా.. 2013 సంవత్సరంలో బలూచిస్థాన్ ప్రావిన్స్ లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించినదని తెలుస్తోంది. క్వెట్టాలో ఈ బాంబ్ బ్లాస్ట్ చోటు చేసుకుంది.
క్వెట్టాలోని ప్రముఖ బచాఖాన్ చౌక్ మార్కెట్‌లో ఈ ఘటన జరిగినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఆపి ఉంచిన ఫ్రాంటియర్ కార్ప్స్ వాహనానికి సమీపంలో బాంబు అమర్చబడింది. ఈ బాంబ్ బ్లాస్ట్ లో ఒక సైనికుడు, ఒక చిన్నారితో సహా 12 మంది చనిపోయారు. 60 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్థాన్ విభజన కోసం పోరాడుతున్న నిషేధిత మిలిటెంట్ గ్రూప్ యునైటెడ్ బలూచ్ ఆర్మీ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఈ చిత్రాన్ని క్వెట్టాకు చెందిన ఫోటోగ్రాఫర్ నసీర్ అహ్మద్ రాయిటర్స్ కోసం క్లిక్ చేశారు.
https://www.dawn.com/news/777830/at-least-93-lives-lost-in-quetta-explosions
`IBTimes' వీడియో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు.
భారత్ కు చెందిన మీడియా సంస్థలు కూడా ఈ ఘటన 2013లో చోటు చేసుకుందని తెలియజేస్తూ కథనాలను ప్రసారం చేశాయి.
https://www.livemint.com/Multimedia/bGXXMPijjZ5mSm25TAJEHI/Tragic-bombings-in-Pakistan-kill-115-people-6.html
కాబట్టి 2013 లో చోటు చేసుకున్న ఘటనను కాస్తా.. ఇటీవల భారత్ తో మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచిన తర్వాత చోటు చేసుకున్న ఘటనగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ పోస్టులలో ఎటువంటి నిజం లేదు.