FactCheck : వైష్ణోదేవి బొమ్మ ఉన్న నాణేల విలువ 10 లక్షల రూపాయలకు పైగానేనా..!
Are old Rs 10 Rs 5 Coins with Vaishno Devis Image Worth Rs 10L heres the truth. వైష్ణో_దేవి కాయిన్ 2002 నాటి రూ. 5, రూ. 10 నాణెం మీదగ్గర ఉందా..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Jan 2022 2:15 PM GMT"👉 #వైష్ణో_దేవి కాయిన్ 2002 నాటి రూ. 5, రూ. 10 నాణెం మీదగ్గర ఉందా..👇👇
👉 ఆపాత మధురం అంటూ ఎప్పుడూ గతంలో చెలామణీలో ఉన్న వస్తువులను, నాణేలను కొనడానికి చాలామంది ఆసక్తిని కనబరుస్తారు..
👉 ఇటీవల కాలంలో అరుదైన కాయిన్స్ కు, పాత నోట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అరుదైన నాణేలు, నోట్లు ఉన్నవారు ఇంట్లోనుంచి కాలు బయట పెట్టకుండా లక్షాధికారులు అవుతున్నారు. దీంతో ఇటువంటివారిని ఆన్ లైన్ లోనే అమ్మడం, కొనడం వంటివి చేస్తున్నారు. ఒక్క నాణెంతోనే లక్షలను ఆర్జిస్తున్నారు. తాజాగా అరుదైన నాణెము ఉన్న వారికి గుడ్ న్యూస్ వైష్ణవి దేవి ఉన్న అరుదైన రూ, 5 లేదా రూ. 10 నాణెం మీ దగ్గర ఉంటె.. సుమారు పది లక్షలకు మీరు యజమాని కావచ్చు. వివరాల్లోకి వెళ్తే..
👉 ఇప్పుడు అరుదైన నాణెం మాతా వైష్ణవి దేవి బొమ్మ ఉన్న నాణేనికి ఆన్‌లైన్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ నాణెం కొనడానికి పలువురు ఆసక్తిని చూపిస్తున్నారు. ఏకంగా రూ. 10 లక్షలను పెట్టి ఈ నాణేలు కొనడానికి రెడీగా ఉన్నారు.
👉 వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని పిలుస్తారు. పార్వతి, సరస్వతి మరియు లక్ష్మి దేవతలు మానవ జాతి శ్రేయస్సు కోసం అందమైన యువరాణిగా అవతరించిందని నమ్ముతుంటారు. వైష్ణవిని ఆరాదిస్తే సంపద కలుగుతుందని విశ్వాసం. అందుకే 2002లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైష్ణవి మాత ఉన్న రూ. 5 లేదా రూ. 10 నాణెలను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ ప్రత్యేక నాణేల కోసం లక్షల్లో చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక ఇప్పుడు ఎవరిదగ్గరైనా ఈ నాణేలు ఉంటె.. ఆన్‌లైన్‌లో అమ్మేసి లక్షాధికారి అయిపోవచ్చు.
👉 ఎలా అమ్మాలంటే..
ముందుగా ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ ప్లాట్‌ఫారమ్ Quikrలో అకౌంట్ ఓపెన్ చేయాలి. తర్వాత ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం మీ దగ్గర ఉన్న ఈ నాణెం కోసం లిస్ట్ క్రియేట్ చేసి, ఫోటోలను అప్‌లోడ్ చేయాలి. ఆ కాయిన్ కు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పెట్టిన నాణేలు నచ్చి ఆసక్తి ఉన్న వ్యక్తులు మీకు మెసేజ్ చేస్తారు. లేదా ఫోన్ చేస్తారు. మీకు నచ్చిన అమౌంట్ వస్తే.. వెంటనే మీ దగ్గర ఉన్న నాణేన్ని అమ్మేయడమే" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న ఈ పోస్టులు ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నాయి.
NewsMeter సంబంధిత కీలక పదాలతో Google సెర్చ్ ను నిర్వహించింది. కొన్ని వార్తా కథనాలను కనుగొంది. జీ న్యూస్ కథనం ప్రకారం పలు వెబ్‌సైట్లలో పాత నాణేలు, నోట్లు వేలం వేస్తున్నారు. రూ. 5 మరియు రూ.10 తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2002లో విడుదల చేసిన వైష్ణోదేవి చిత్రంతో కూడిన నాణేలకు ఇటీవల ఇ-కామర్స్ సైట్‌లలో చాలా డిమాండ్ ఉందని పేర్కొంది. అయితే, ఆన్‌లైన్‌లో పాత నాణేలు మరియు కరెన్సీ నోట్ల విక్రయాలు, కొనుగోలు విషయంలో RBI హెచ్చరించిందని కూడా పేర్కొంది.
4 ఆగస్టు 2021న, పాత నాణేలు- నోట్ల ఆన్‌లైన్ అమ్మకాలు, కొనుగోళ్ల గురించి RBI ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. కొంతమంది వ్యక్తులు భారతీయ రిజర్వ్ బ్యాంక్ పేరు/లోగోను ఉపయోగించి పాత నాణేలు, నోట్లను విక్రయిస్తున్నారని.. వివిధ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాత నోట్లు మరియు నాణేల కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన లావాదేవీలలో ప్రజల నుండి ఛార్జీలు/కమీషన్/పన్ను కోరుతున్నారని పేర్కొంది. అలాంటి విషయాల్లో ఆర్‌బీఐ వ్యవహరించదని.. ఎలాంటి ఛార్జీలు/కమీషన్‌లు కోరదని కూడా స్పష్టం చేసింది. అటువంటి లావాదేవీలలో తన తరపున ఛార్జీలు/కమీషన్‌లు వసూలు చేయడానికి ఆర్‌బీఐ ఏ సంస్థ/సంస్థ/వ్యక్తి మొదలైన వాటికి అధికారం ఇవ్వలేదు, అలాగే ఆర్‌బీఐ పేరును ఉపయోగించి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల బారిన పడవద్దని ప్రజలకు సూచించింది.
Indiamart, Quikr, Earn Money, Coin Bazaar, OLX వంటి ఈ-కామర్స్ సైట్‌లు పాత నాణేలు మరియు కరెన్సీ నోట్లతో వ్యాపారం చేస్తున్నాయి. అయితే ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లు థర్డ్ పార్టీలుగా మాత్రమే పనిచేస్తాయి. వస్తువుల అమ్మకం లేదా కొనుగోలుతో వారికి ఎటువంటి సంబంధం లేదు. జరిగే ఏవైనా లావాదేవీలు లేదా మోసాలకు కూడా వారు బాధ్యత వహించరు. కాబట్టి అటువంటి లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. (మూలం: BBC)
5 రూపాయలు, 10 రూపాయల కాయిన్ పై మాతా వైష్ణో దేవి చిత్రం ఉన్న వాటిని 10 లక్షలకు కొనుక్కుంటున్నారనే విషయంలో ఎటువంటి నిజం లేదు.