Fact Check : లాల్ బహదూర్ శాస్త్రి భార్య 5000 రూపాయలు కారు లోన్ కట్టారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Oct 2020 8:08 PM ISTఅక్టోబర్ 2న మహాత్మా గాంధీ పుట్టినరోజుతో పాటు... భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజును కూడా ఘనంగా నిర్వహించారు. ఆరోజున సోషల్ మీడియాలో ఓ పోస్టు బాగా వైరల్ అయింది. ‘when Lal Bahadur Shastri was Prime Minister of India, he took a loan of Rs 5,000 from PNB bank to buy a Fiat car. But unfortunately, he died after some time. So the bank officials wanted to waive the loan but Shastri’s wife refused this offer and she repaid the loan from her pension. Honesty Level for Country’ అంటూ మెసేజీలు, పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన కుటుంబం పాటించే విలువలకు సంబంధించిన కథనం ఇది చెబుతూ ఉన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంకులో 5000 రూపాయలు ఋణం తీసుకుని ఫియట్ కారును కొన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన మరణించారు. బ్యాంకు అధికారులు ఈ ఋణంను తిరిగి వసూలు చేయాలని అనుకోలేదు. అందుకు లాల్ బహదూర్ శాస్త్రి భార్య ఒప్పుకోలేదు. తన పెన్షన్ లో నుండి ఆవిడ ఈ లోన్ ను చెల్లించారు. వారి నిజాయితీకి నిదర్శనం ఇదని చెబుతూ ఉన్నారు.
ఈ పోస్టును ఫేస్ బుక్, ట్విట్టర్ లలో తెగ వైరల్ చేశారు.
నిజ నిర్ధారణ:
భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కారు కోసం లోన్ తీసుకున్నారని.. ఆయన చనిపోయాక భార్య ఆ లోన్ ను చెల్లించారని వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి నిజం'.
రిపోర్టుల ప్రకారం 1964 లో లాల్ బహదూర్ శాస్త్రి ఫియట్ కారును కొనుక్కుందామని అనుకున్నారు. ఆ కారు ధర అప్పట్లో 12000 రూపాయలు. ఆయన కుటుంబం దగ్గర అంత మొత్తం లేదు. కేవలం 7000 రూపాయలు మాత్రమే ఉంది. ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆయన 5000 రూపాయలు లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన దరఖాస్తు చేసుకున్న రోజే లోన్ కూడా ఇచ్చారు. కారును కొన్నారు కూడా..! ఆ తర్వాత కొద్దిరోజులకు ఆయన అకాలమరణం చెందడం కుటుంబాన్ని మాత్రమే కాదు.. యావత్ భారతదేశాన్ని శోక సముద్రంలో ముంచేసింది. కానీ ఆయన మరణం తర్వాత భార్య లోన్ ను కట్టేసింది. తనకు వస్తున్న పెన్షన్ ద్వారా.. కారు రుణాన్ని ఆమె చెల్లించగలిగారు.
2018లో నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోయినప్పుడు. భారత మాజీ ప్రధాని కూడా అదే బ్యాంకులో లోన్ తీసుకున్నారనే విషయం పెద్ద ఎత్తున వార్తల్లో వచ్చింది.
2018లో కాంగ్రెస్ సీనియర్ నేత, లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ 'మేము సెయింట్ కొలంబియా స్కూల్ కు టాంగాలో వెళుతూ ఉండే వాళ్ళము. అప్పుడప్పుడు మాత్రమే నాన్న గారు కార్ లో తీసుకుని వెళ్లే వారు. అంతేకానీ ఎటువంటి పర్సనల్ పనులకు కూడా ఆఫీసు కారును ఉపయోగించే వాళ్ళం కాదు. ఇక ఇంట్లో కొత్త కారు కొనాలి అన్న డిమాండ్ అప్పటి నుండే మొదలయ్యింది' అని చెప్పుకొచ్చారు.
1964 మోడల్ క్రీమ్ కలర్ ఫియట్ కారును శాస్త్రి కుటుంబం కొన్నారు. DLE 6 అనే నంబర్ కూడా ఆ కారుకు ఉంది. లాల్ బహదూర్ శాస్త్రి స్మృత్యర్థం ఢిల్లీలోని మోతిలాల్ నెహ్రూ మార్గ్ లో ఏర్పాటు చేసిన 'లాల్ బహదూర్ శాస్త్రి మెమోరియల్' లో ఈ కారు ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.
భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కారు కోసం లోన్ తీసుకున్నారని.. ఆయన చనిపోయాక భార్య ఆ లోన్ ను చెల్లించారన్నది నిజం.