యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు తన వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాడు. ఇప్పటికే రౌడీ దుస్తుల పేరుతో వ్యాపారాన్ని నడుపుతున్న విజయ్ దేవరకొండ.. తాజాగా మరో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏషియన్ విజయ్ దేవరకొండ పేరుతో మల్టీఫ్లెక్స్ థియేటర్‌ను నిర్మించాడు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి విజయ్ దేవరకొండ ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టారు. కాగా ఈ థియేటర్‌లో తన గురువైన శేఖర్ కమ్ముల తాజాగా దర్శకత్వం వహించిన 'లవ్‌స్టోరీ' సినిమాను విడుదల చేశారు.
తన తల్లి మాధవి పుట్టిన రోజు సందర్భంగా ఈ థియేటర్‌ను విజయ్ దేవరకొండ ప్రారంభించాడు. ఈ సందర్భంగా తన తల్లి థియేటర్‌లో ఉన్న ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నాడు. 'హ్యాపీ బర్త్ డే మమ్ములు, ఇది నీకోసం (ఏవీడీ). నీవు ఆరోగ్యంగా ఉంటే తాను మరింత కష్టపడతానని, మరిన్ని జ్ఞాపకాలు ఇస్తానని' ట్విటర్‌లో అన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న 'లైగర్' సినిమా యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది.