ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూత‌

Veteran singer Vani Jayaram passes away. తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి.

By Medi Samrat  Published on  4 Feb 2023 3:58 PM IST
ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూత‌

తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూ ఉన్నాయి. ప్రముఖ సినీ నేపథ్య గాయని వాణీ జయరాం కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. శనివారం ఉదయం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణీ జయరాం జన్మించారు. ఆమె అసలు పేరు కలైవాణి. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో ఆమె ఐదో సంతానం. కర్ణాటక సంగీతం నేర్చుకున్న వాణి తన ఎనిమిదో ఏటనే సంగీత కచేరీ నిర్వహించారు. నాటి మద్రాస్ క్వీన్స్ మేరీ కళాశాల నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మ భూషణ్‌ అవార్డుతో సత్కరించింది. ఇక ఆమె కెరీర్ లో ఎన్నో అవార్డులను అందుకున్నారు.

వాణీ జయరామ్ తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడతో సహా అనేక భారతీయ భాషలలో పాడగా తెలుగులో ఆమె పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగుతోపాటు దాదాపు 14 భాషల్లో 20 వేలకు పైగా పాటలు పాడారు. కె.వి.మహదేవన్‌, ఎం.ఎస్‌.విశ్వనాధన్‌, ఇళయరాజా, పెండ్యాల, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఎక్కువ పాటలు పాడారు. ఆమె స్వాతికిరణం, పెళ్ళి పుస్తకం, స్వర్ణకమలం, ఆరాధన, శృతిలయలు, సీతాకోకచిలుక, శంకరాభరణం, మరోచరిత్ర, అంతులేని కథ, సీతా కళ్యాణం వంటి ఎన్నో సినిమాలలో ఆమె సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించారు. ఆమె సింగింగ్ కెరీర్ 1971లో ప్రారంభమవగా నాలుగు దశాబ్దాలకు పైగా ఆమె పాటలు పాడుతూనే ఉన్నారు. ఆమె మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


Next Story