ప్రముఖ ఒడియా నటుడు రాయ్మోహన్ పరిదా(58) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. రాయ్మోహన్ భువనేశ్వర్‌లోని ప్రాచి విహార్ ప్రాంతంలోని తన ఇంట్లో ఉరివేసుకుని కనిపించారు. ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు ఆత్మహత్యగా బావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాయ్మోహన్ పరిదా ఉదయం తన గదిలో ఉరివేసుకుని కనిపించాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
రాయ్మోహన్ పరిదా మృతి గురించి తెలుసుకున్న పలువురు నటీనటులు ఆయన ఇంటికి చేరుకుని సంతాపం తెలిపారు. రాయ్మోహన్ పరిదా నెగెటివ్ రోల్స్‌లో నటించడం విశేషం. సుప్రసిద్ధ థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆయన 100 కి పైగా ఒడియా చిత్రాలకు పనిచేశారు. 15 బెంగాలీ చిత్రాలలో కూడా నటించారు. రాయ్మోహన్ పరిదా ఒడిశాలోని కియోంజర్ జిల్లాకు చెందినవారు. రామ లక్ష్మణ్, ఆసిబు కేబే సాజీ మో రాణి, నాగ పంచమి, ఉదండి సీత, తూ తిలే మో దారా కహకు, రాణా భూమి, సింఘ బహిని, కులానందన్, కంధేయి ఆఖిరే లుహా వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో ఆయన నటించారు.
రాయ్మోహన్ పరిదాతో కలిసి చాలా చిత్రాలలో నటించిన నటుడు సిద్ధాంత మహాపాత్ర మాట్లాడుతూ.. జీవితంలో అనేక ఒడిదుడుకులను అనుభవించిన వ్యక్తి.. ఇలాంటి పని చేయాలని అనుకుంటాడంటే నమ్మడం కష్టం. అతను వృత్తిలో చాలా విజయవంతమయ్యాడని అన్నారు.
మరో నటుడు శ్రీతమ్ దాస్ మాట్లాడుతూ.., "జీరో నుండి హీరో"గా మారిన పరిదా ఆత్మహత్యతో చనిపోవడం నమ్మశక్యంగా లేదన్నారు.