చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, స్క్రీన్ రైటర్ శివ సుబ్రహ్మణ్యం కన్నుమూశారు. చిత్రనిర్మాత అశోక్ పండిట్ సోమవారం ఉదయం సుబ్రహ్మణ్యం మరణాన్ని ధృవీకరించారు. "మా ప్రియమైన స్నేహితుడు, గొప్ప నటుడు, అద్భుతమైన మనిషి అయిన శివ సుబ్రమణ్యం మరణం గురించి తెలిసి చాలా షాక్ అయ్యాను. ఎంతగానో చింతిస్తున్నాను. ఆయన భార్య దివ్యకు ఈ విషాదాన్ని ఎదుర్కొనేంత శక్తిని భగవంతుడు ప్రసాదిస్తాడని కోరుకుంటూ ఉన్నాను" అని అశోక్ ట్వీట్ చేశారు. శివ కుమార్ సుబ్రమణ్యం చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే ఆయన కుమారుడు జహాన్ కేవలం 2 నెలల క్రితమే మరణించారు.
1989 చలనచిత్రం 'పరిందా', సుధీర్ మిశ్రా యొక్క 'హజారోన్ ఖ్వైషీన్ ఐసి'కి స్క్రీన్‌ప్లే వ్రాసినందుకు సుబ్రహ్మణ్యం మంచి పేరు పొందారు. పలు సినిమాల్లో కూడా ఆయన మంచి పాత్రలు చేశారు. 'టూ స్టేట్స్'లో అలియా భట్‌కి తండ్రిగా నటించి అనేక మంది హృదయాలను గెలుచుకున్నారు. అతను చివరిగా నెట్‌ఫ్లిక్స్ చిత్రం 'మీనాక్షి సుందరేశ్వర్'లో కనిపించారు. శివ కుమార్ సుబ్రమణ్యం సినిమాల్లో నటనను ప్రదర్శించడమే కాకుండా కొన్ని చిత్రాలకు స్క్రీన్ ప్లే కూడా రాశారు. శివ కుమార్ సుబ్రమణ్యం అంత్యక్రియలను ఏప్రిల్ 11 ఉదయం 11 గంటలకు మోక్షధామ్ హిందూ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. శివ కుమార్ ఆకస్మిక మరణ వార్తతో అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడి అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.