ఒకప్పుడు సినిమా నిర్మించాలంటే అందులో హీరో హీరోయిన్ పాత్రలకు మాత్రమే ఎంతో ప్రాధాన్యత ఇచ్చి సినిమాలను తెరకెక్కించే వారు. కానీ ప్రస్తుతం సినిమాలు హీరోకు ఏ మాత్రం తగ్గకుండా విలన్ పాత్రను కూడా తీర్చిదిద్దుతున్నారు. హీరోతో సమానంగా సినిమాను రక్తి కట్టించాలంటే, హీరోకు ధీటుగా ఉండే ప్రతినాయకుడు ఉంటేనే ఆ సినిమా విజయవంతం అవుతుంది. అందుకోసమే దర్శకనిర్మాతలు ప్రస్తుతం ప్రతినాయకుడి పాత్రకు కూడా కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాలలో నటించే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
ఒకప్పుడు తెలుగు విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ ఒక ఊపు ఊపారు. ఇతనితో పాటు జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ ను విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు. అలనాటి సీనియర్ నటుడు రావు గోపాలరావు గారి కొడుకు రావు రమేష్ తన విలనిజం ఎంతో అద్భుతంగా ప్రదర్శిస్తారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో విలన్ పాత్రలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎవరిదంటే? గత సంక్రాంతికి విడుదలైన అలా వైకుంఠపురం సినిమా ద్వారా విలన్ పాత్రలో నటించి అందరిని మెప్పించిన సముద్రఖని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారిపోయాడు.
అలా వైకుంఠపురం సినిమా భారీ హిట్ అవడంతో ఇతనికి వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈ సంక్రాంతికి విడుదలైన రవితేజ క్రాక్ సినిమాలో విలక్షణ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మరోసారి తన నటనను నిరూపించుకున్న సముద్రఖని ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శక నిర్మాతల చూపు ఇతని పై పడింది. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సముద్రఖనికి మంచి డిమాండ్ ఉందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయం.