జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఫిల్మ్ ఛాంబర్ కు సంబంధం లేదని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాల మద్దతు అవసరమని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది. ప్రభుత్వాల మద్దతు లేకుండా సినీ పరిశ్రమ మనుగడ కష్టమని వెల్లడించింది. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ కష్టాలలో ఉంది. సినీ పరిశ్రమపై ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. వ్యక్తిగత అభిప్రాయాలను వివిధ వేదికలపై చెబుతున్నారు. వ్యక్తిగత అభిప్రాయాలతో మాకు సంబంధం లేదని ఫిల్మ్ ఛాంబర్ ఆప్ కామర్స్ స్పష్టం చేసింది.
ఇదిలావుంటే.. రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లు పెట్టుబడితో సినిమాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ చేస్తానంటోంది.. కష్టం మేము పడితే టిక్కెట్లు మీరు అమ్ముకుంటారా? అని వ్యాఖ్యానించారు. భయపడడానికి ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్ అని.. వైసీపీ రిపబ్లిక్ అని మాట్లాడితే జనం బయటకు లాక్కొచ్చి కొడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రులు ఘాటుగా స్పందించారు.