తమిళ సినీ స్టంట్ మాస్టర్, హిందూ మున్నాని ఆర్ట్ అండ్ కల్చర్ వింగ్ తమిళనాడు ప్రెసిడెంట్ కనల్ కణ్ణన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరిలో ఆయనను చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజుల కిందట శ్రీరంగం ఆలయం వెలుపల పెరియార్ విగ్రహంపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే ప్రసంగం చేశారంటూ సెక్షన్ 153 బీ కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
కనల్ కణ్ణన్ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఇక కనల్ కన్నన్ ను అరెస్ట్ చేసేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు మధురవాయల్ లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో... వడపళని, వలసరవాక్కంలోని ఇళ్లలో కూడా వెతికారు. తనను అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన పుదుచ్చేరిలో తలదాచుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సెల్ ఫోన్ ఆధారంగా ఆయన పాండిచ్చేరిలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడకు వెళ్లిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. తెలుగులో అన్నయ్య సినిమాతో ఫైట్ మాస్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆయన.. దాదాపు 30కు పైగా చిత్రాలలో పనిచేశారు. అందులో చాలా సినిమాలు హిట్ అయ్యాయి.