సోనూ సూద్.. భావోద్వేగ ట్వీట్
Sonu Sood Responds On IT Raids. సోనూ సూద్.. కరోనా కష్ట కాలంలో ఎంతో మందికి సహాయం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు.
By Medi Samrat
సోనూ సూద్.. కరోనా కష్ట కాలంలో ఎంతో మందికి సహాయం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయనపై తీవ్ర ఆరోపణలను ఐటీ డిపార్ట్మెంట్ చేసిన సంగతి తెలిసిందే..! ముంబైలోని ఆయన నివాసంతో పాటు జైపూర్, నాగపూర్ లలో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోను ఛారిటీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. దాడులు పూర్తయిన తర్వాత రూ. 20 కోట్లకు పైగా ట్యాక్స్ ఎగ్గొట్టాడని ఐటీ అధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో నిరుపేదలకు సహాయపడేందుకు గత ఏడాది జులై నెలలో సూద్ ఛారిటీ ఫౌండేషన్ ను స్థాపించారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆ సంస్థ రూ.20 కోట్ల మేర విరాళాల రూపంలో సేకరించినట్లు తెలుస్తోంది. దీంట్లో ఇప్పటి వరకు 1.9 కోట్లను మాత్రమే ఖర్చు చేశారని అధికారులు గుర్తించారు.
ఏకంగా మూడు రోజుల సోనూసూద్ నివాసం, నాగ్‌పూర్, జైపూర్‌లోని కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరిగాయి. ఇవి సోదాలే(సర్వే)నని దాడులు(రైడ్స్) కావని ఐటీ అధికారులు ప్రకటించారు. ఈ సోదాల్లో అధికారులు భారీ మొత్తంలో పన్ను ఎగవేతను గుర్తించినట్లు తెలిసింది. బాలీవుడ్ చిత్రాలకు సంబంధించి తీసుకున్న పేమెంట్లు, వ్యక్తిగత ఆదాయం, రియల్ ఎస్టేట్‌కు సంబంధించి సోనూసూద్ పన్నులను ఎగవేసినట్లు అధికారులు నిర్ధారించినట్లు సమాచారం.
"सख्त राहों में भी आसान सफर लगता है,
— sonu sood (@SonuSood) September 20, 2021
हर हिंदुस्तानी की दुआओं का असर लगता है" 💕 pic.twitter.com/0HRhnpf0sY
తన మీద ఐటీ డిపార్ట్మెంట్ చేసిన వ్యాఖ్యలపై సోనూ సూద్ స్పందించారు. "ప్రతిసారి నీ గురించి నీవు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలను సమయం చెపుతుంది. దేశ ప్రజలకు నా శక్తి మేరకు సేవ చేయాలని మనస్పూర్తిగా నిర్ణయించుకున్నా. నా ఫౌండేషన్ లో ఉన్న ప్రతి రూపాయి కూడా ఒక విలువైన జీవితాన్ని కాపాడటం కోసం, అవసరమైన వారిని ఆదుకోవడం కోసం ఎదురు చూస్తోంది. వివిధ ఎండార్స్ మెంట్ల ద్వారా వచ్చే డబ్బును సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించమని నా బ్రాండ్లను ఎంకరేజ్ చేస్తుంటా. ఇప్పటికీ అది జరుగుతోంది. గత నాలుగు రోజులుగా నా అతిథుల (ఐటీ అధికారులు)తో బిజీగా ఉన్నా. అందువల్ల మీ సేవకు దూరమయ్యా. ఇప్పుడు మళ్లీ తిరిగివచ్చాను, నా ప్రయాణం కొనసాగుతుంది" అంటూ భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు.