బిగ్‌బ్రేకింగ్‌ : కన్నుమూసిన సిరివెన్నెల

Sirivennela Sitaramasastry Passes Away. ప్రముఖ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యుమోనియాతో బాధపడుతూ

By Medi Samrat  Published on  30 Nov 2021 4:38 PM IST
బిగ్‌బ్రేకింగ్‌ : కన్నుమూసిన సిరివెన్నెల

ప్రముఖ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యుమోనియాతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఆయన ఆరోగ్యం ఈరోజు ఉదయం మరింత క్రిటికల్ గా మారింది. ప‌రిస్థితి ఇంకా విష‌మించడంతో కిమ్స్ డాక్ట‌ర్స్ ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను పిలిచి ప‌రిస్థితిని వివరించారు. ఈ సాయంత్రం 4 గంట‌ల 7 నిమిషాల‌కు ఆయ‌న తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి వయసు 66 సంవత్సరాలు. న్యుమోనియాతో నవంబర్ 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. నిపుణులైన వైద్యుల బృందం ఆయన్ను కోలుకునేలా చేయడానికి ప్రయత్నించింది. ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని తెలుస్తోంది.

1986లో విడుద‌లైన 'సిరివెన్నెల‌' చిత్రంతో గేయ ర‌చ‌యిత సినీ ప్ర‌స్థానాన్ని సీతారామ‌శాస్త్రి ప్రారంభించారు. తొలి సినిమాతోనే ఆయ‌న‌కు చాలా మంచి పేరు వ‌చ్చింది. మూడున్న‌ర దశాబ్దాలుగా ఆయ‌న ఎన్నో వేల పాట‌ల‌ను రాశారు. సిరివెన్నెల అద్భుత‌మైన క‌లం నుంచి జాలువారిన పాట‌ల‌కు నంది అవార్డులు వచ్చాయి. స్వయంకృషి, స్వర్ణ కమలం, శ్రుతిలయలు, గాయం, స్వాతి కిరణం, క్షణ క్షణం, సింధూరం, నువ్వే కావాలి, ఒక్కడు, వర్షం, గమ్యం వంటి చిత్రాలకు ఆయన పాటలు రాశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి కళల రంగంలో ఆయన చేసిన కృషికి 2019లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.



Next Story