బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా 'రాధే'. ఈ సినిమాను రంజాన్ కానుకగా భారీ స్థాయిలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో ఉండడం.. వారాంతాల్లో కర్ఫ్యూ వంటివి ఉండడంతో సల్మాన్ ఖాన్ సినిమాకు థియేటర్లలో ఆదరణ దక్కడం కష్టమే.! దీంతో చిత్ర బృందం సల్మాన్ ఖాన్ సినిమాను థియేటర్లలోనూ, ఓటీటీలలోనూ ఒకేసారి విడుదల చేయాలని భావిస్తోంది.
మే13న సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన రాధే సినిమా అటు సినిమా థియేటర్ల లోనూ, ఇటు జీ ప్లెక్స్ లో చూడొచ్చు. పే పర్ వ్యూ ద్వారా సినిమాను ఇంట్లో కూర్చునే టీవీలో ఎంజాయ్ చేయొచ్చు. జీ ప్లెక్స్ ను పలు డీటీహెచ్ సంస్థలు అందిస్తూ ఉన్నాయి. జీ స్టూడియోస్ ప్రతినిధి షరీఖ్ పటేల్ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా ఉన్న పరిస్థితుల వలన ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ సినిమాను అభిమానులు థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారని.. కానీ చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లను తెరచడంలేదని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలా రిలీజ్ చేయడం వలన పండగ రోజు కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే కూర్చుని సినిమాను ఎంజాయ్ చేయవచ్చని తెలిపారు. ఓటీటీతో పాటూ వివిధ దేశాల్లో కూడా సల్మాన్ ఖాన్ 'రాధే' రిలీజ్ కాబోతోంది. రాధే సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించగా దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. జాకీ ష్రాఫ్, రణదీప్ హుడాలు కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. రాధే:యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్ ట్రైలర్ ఏప్రిల్ 22న విడుదల చేయనున్నారు.