రామ్‌గోపాల్ వ‌ర్మ 'మ‌ర్డ‌ర్' మూవీ రివ్యూ

RGV Murder Movie Review. రామ్‌గోపాల్ వ‌ర్మ వెండితెర‌పై హిట్ కొట్టి చాలా కాల‌మే అయిపోయింది.

By Medi Samrat  Published on  24 Dec 2020 2:01 PM IST
రామ్‌గోపాల్ వ‌ర్మ మ‌ర్డ‌ర్ మూవీ రివ్యూ

సినిమా : మ‌ర్డ‌ర్

నటీనటులు: శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రీ భార్గవి, సాహితీ, గిరిధర్, దీపక్, గణేష్

దర్శకత్వం: ఆనంద్ చంద్ర

నిర్మాతలు: నట్టి కరుణ, నట్టి క్రాంతి

సంగీతం: డిఎస్ఆర్

సమర్పణ: రాంగోపాల్ వర్మ

ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్

రామ్‌గోపాల్ వ‌ర్మ వెండితెర‌పై హిట్ కొట్టి చాలా కాల‌మే అయిపోయింది. యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీస్తూ ప్రేక్షకుకను థియేటర్లకు రప్పిస్తూ ఉంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఒక ప‌రువు హ‌త్య స్పూర్తితో కొన్ని య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం "మర్డర్". ఈ సినిమా ఆర్జీవి సమర్పణలో వచ్చింది. అంద‌రూ అనుకున్న‌ట్లే ఈ చిత్రం మిర్యాల‌గూడ పరువు హ‌త్య‌కి.. సంబంధించిన‌దా..? కాదా ..? ఈ చిత్రంతోనైనా వ‌ర్మ హిట్ కొట్టాడో లేదో చూద్దాం.

క‌థ : సమాజంలో పేరు, ప్రతిష్టలు, హోదా ఉన్న వ్య‌క్తి మాధవరావు (శ్రీకాంత్ అయ్యంగార్). ఆయ‌న‌కు కూతురు న‌మ్ర‌త‌(సాహితి) అంటే ఎంతో ఇష్టం. కూతురు పుట్టాకే త‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చింద‌ని న‌మ్మి.. ఆమెను ఎంతో గారాభంగా పెంచుకుంటుంటాడు. తన కూతురు ఏది అడిగినా కాదనకుండా సాహితికి అన్నీ ఇస్తాడు. అలా మాధవరావు తన కూతుర్ని గొప్పగా ఊహించుకొంటున్న సమయంలో సాహితి.. క‌ళాశాల‌లో ప్రవీణ్ అనే వ్య‌క్తిని ప్రేమించాన‌ని చెబుతుంది.

అయితే.. ప్రవీణ్ త‌న ఆస్తి కోసం ఊరిలో త‌న ప‌రువు మ‌ర్యాద‌ల్ని దెబ్బ తీయ‌డం కోస‌మే న‌మ‌త్ర‌ని వ‌ల‌లో వేసుకున్నాడ‌ని తెలుసుకున్న మాధ‌వ‌రావు వారి ప్రేమ‌ను నిరాక‌రిస్తాడు. తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటూ న‌మ్ర‌త‌ కోరికను తిరస్కరిస్తారు. దాంతో ఉన్నట్టుంది తండ్రి, కూతురు మధ్య కోపతాపాలు పెరిగిపోతాయి. ఇంటి నుంచి పారిపోయి తన తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది న‌మ్ర‌త‌. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన కూతురు చేసిన పనికి కుంగిపోయిన మాధవరావు.. స‌మాజంలో త‌న ప‌రువు మ‌ర్యాద‌ల్ని తిరిగి నిల‌బెట్టుకోవ‌డం కోసం ఓ క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంటాడు. తండ్రి మాటను జవదాటిన న‌మ్ర‌త‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకొన్నది. న‌మ్ర‌త‌ పెళ్లిని అంగీకరించని మాధవరావు ఏం చేశాడు? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేష‌ణ : ఇక ఈ సినిమా ముందు నుంచి అనుకున్నట్టుగా మిర్యాలగూడ ప్రణయ్ హత్య ఆధారంగానే తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. కానీ చిత్ర బృందం అలా అనిపిస్తే మా తప్పు ఏమీ లేదంటూ చెప్పిన సంగతి తెలిసిందే. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం మాధవరావు తన కుతురుపై చూపించే ప్రేమను చూపిస్తే.. సెకండ్ హాఫ్ లో ప్రవీణ్ పై మాధవరావు ఎలా కోపం తో రగిలిపోయాడు. చంపడానికి ఎలా స్కెచ్ లు వేసాడు. తండ్రిగా అతడు అనుభవించే క్షోభ ను చూపించారు. ముఖ్యంగా ఈ సినిమా లో కూతురు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తండ్రులు పడే ఆవేదన బాధ ను చూపించాడు దర్శకుడు. క‌థ‌లో స‌న్నివేశాల‌న్నీ పూర్తిగా మాధ‌వ‌రావు పాత్ర‌కు అనువుగా సాగుతుండ‌డంతో అక్క‌డ‌క్క‌డా క‌థ‌లో ప‌ట్టు స‌డ‌లిన‌ట్లు అనిపిస్తుంటుంది. కొన్ని చోట్ల స‌న్నివేశాలు న‌త్త‌న‌డ‌క‌న నడిచిన‌ట్లు అనిపించ‌డంతో పాటు ఏదో సీరియ‌ల్ చూస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది.

సినిమా కథ మొత్తం ముగ్గురి చుట్టే తిరగటం కూడా సినిమాకు మైనస్ అయ్యింది. ప్ర‌వీణ్ హ‌త్య స‌మ‌యంలో వ‌చ్చే నేప‌థ్య సంగీతంతో ఒళ్లు జ‌ల‌ద‌రించేలా చేస్తుంది. సినిమాలో మాధవరావు పాత్రలో నటుడు ఒదిగిపోయాడు. ఒక తండ్రి భావోద్వేగాలు ఇలా ఉంటాయి. అని కచ్చితంగా చూపించగలిగాడు. తక్కువ ఖర్చుతో తీసునప్పటికి సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివ‌ర‌గా ఈ చిత్రం గురించి చెప్పాలంటే.. కుటుంబ విలువులు, పిల్లలపై ప్రేమాభిమానాలు చూపే తల్లిదండ్రుల వ్యధ, భావోద్వేగాల కలయికగా రూపొందిందని చెప్పవచ్చు.


Next Story