కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించగా.. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతించారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాటం చేస్తూ చనిపోయిన 750 మంది రైతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. ఆ కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోరాటంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు రాష్ట్రం తరఫున రూ.3 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని చెప్పారు. కేంద్రం కూడా ఒక్కొ రైతు కుటుంబానికి రూ.25లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని శనివారం సీఎం కేసీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
సీఎం కేసీఆర్ చెప్పిన విషయాలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా.. రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి సీఎం కేసీఆర్ నిర్దయంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో సినీ నటులు సమంత, నాని, రామ్, రానా, ఉన్నారు. రైతుల కుటుంబాలకు ఈ సాయం ఉపయోగపడుతుందన్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తూనే ప్రధానిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రియమైన 'ప్రధాని గారూ..క్షమాపణలు ఒక్కటే సరిపోదు. ఆ రైతు కుటుంబాల బాధ్యత మీరు తీసుకుంటారా..?' అని ప్రశ్నించారు.