మెగాస్టార్ చిరంజీవి ఐఎఫ్‌ఎఫ్‌ఐ 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్'గా ఎంపికయ్యారు. చిరంజీవికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం ప్రకటించారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 53వ ఎడిషన్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా.. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత విజయవంతమైన, ప్రభావంతమైన నటుల్లో ఒకరిగా మెగాస్టార్ చిరంజీవిని పరిగణిస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ''నటుడిగా, డ్యాన్సర్‌గా, నిర్మాతగా 150 చిత్రాలతో పాటు 4 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌ను చిరంజీవి కలిగి ఉన్నారు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన ప్రదర్శనలతో తెలుగు సినిమాల్లో ఆయన విపరీతమైన ప్రజాదరణ పొందారు.'' అని కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.
చిరంజీవికి అరుదైన అవార్డు దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. చిరంజీవి విలక్షణమైన నటుడని.. విశిష్ట నటనా చాతుర్యంతో భిన్న రకాల పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణను చూరగొన్నారని ప్రశంసించారు. తన అద్భుతమైన వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నారని.. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అందుకుంటున్నందుకు చిరంజీవిని అభినందిస్తున్నానని తెలిపారు. ప్రధాని మోదీ అభినందనల పట్ల చిరంజీవి స్పందించారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మీ అభినందనలను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని.. ప్రశంసాపూర్వకమైన మీ మాటలు సంతోషదాయకం అని చెప్పుకొచ్చారు చిరంజీవి.