తెలుగు, తమిళ హీరోల షూటింగ్స్ బంద్

Movie Workers going to Strike for Increase Daily wages. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ కార్మికులు సమ్మెకు దిగారు.

By Medi Samrat  Published on  22 Jun 2022 3:30 PM IST
తెలుగు, తమిళ హీరోల షూటింగ్స్ బంద్

వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ కార్మికులు సమ్మెకు దిగారు. హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్ పరిధి వెంకటగిరిలోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన దిగారు. ఈ ఆందోళనల్లో ఫెడరేషన్‌కు చెందిన 24 విభాగాల కార్మికులు పాల్గొన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. హైదరాబాద్‌లో పరిసరాల్లో 20కిపైగా షూటింగ్‌లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయినట్టుగా తెలుస్తోంది. ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్దకు చేరకున్న సినీ కార్మికులు.. 30 శాతం వేతనాలు పెంచాలని కోరుతున్నారు. నాలుగేళ్ళుగా పెంచాల్సిన వేతనాలు పెంచడం లేదని, దాని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయని తెలిపారు. తమ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకునేవరకు ఆందోళన కొనసాగిస్తామని అంటున్నారు.

సినీ కార్మికుల ఆందోళన నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వేతనాల పెంపుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తమ చేతుల్లో ఏమి లేదని ఫెడరేషన్‌ కార్యవర్గ సభ్యులు నిన్న ఫిల్మ్‌ చాంబర్‌, నిర్మాత మండలిని హెచ్చరించారు. అయితే దీనిపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ కామర్స్‌ నూతన అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ అన్నారు. ఫెడరేషన్‌ నుంచి తమకు ఎలాంటి సమ్మె నోటీసులు రాలేదని, ఒకవేళ కార్మికులు సమ్మె చేయాలనుకుంటే 15 రోజుల ముందు నోటిసుల ఇవ్వాలని తెలిపారు. తమకు వేతనాలు పెంచేవరకు షూటింగ్స్‏కు రామని కార్మికులు స్పష్టం చేశారు. నేటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్మె ప్రారంభం అయిందని కార్మికులు తెలిపారు. ఇన్ని రోజులు వరకు వేతనాలు పెంచకుండా పని చేయించుకున్నారని… ఇప్పుడు వేతనాలు పెంచే వరకు షూటింగ్స్‏కు రాకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.









Next Story