చిరంజీవి ఇంట్లో కీలక సమావేశం.. ఫోన్ చేసి మరీ పిలిచిన ఏపీ ప్రభుత్వం
Movie Officials meet In Chiranjeevi House. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో సీనీ పరిశ్రమ సమస్యలపై చర్చించాలని టాలీవుడ్ హీరో చిరంజీవిని
By Medi Samrat Published on 16 Aug 2021 5:55 AM GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో సీనీ పరిశ్రమ సమస్యలపై చర్చించాలని టాలీవుడ్ హీరో చిరంజీవిని పిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రితో చర్చించి సమస్యల పరిష్కారం కోసం రావాలంటూ మంత్రి పేర్ని నాని ఫోన్ చేసి చిరంజీవిని ఆహ్వానించారు. వెంటనే చిరంజీవి స్పందిస్తూ టాలీవుడ్ ప్రముఖులతో చిరంజీవి భేటీ అయ్యారు. చిరంజీవి వారిని తన ఇంటికి ఆహ్వానించారు. దాదాపుగా మూడు గంటల పాటు సమావేశమయ్యరు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించారు.
చిరంజీవి నివాసంలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమావేశం కొనసాగింది. భేటీకి హాజరైన సినీ ప్రముఖుల్లో నాగార్జున, అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్ బాబు, దిల్ రాజు, మైత్రి మూవీస్ రవి ప్రసాద్, సుప్రియ, ఆర్.నారాయణమూర్తి, ఎన్వీ ప్రసాద్, సి.కల్యాణ్, వీవీ వినాయక్, కొరటాల శివ ఉన్నారు. సమావేశం సందర్భంగా సినీ కార్మికులు, థియేటర్ కార్మికుల సమస్యలు, విద్యుత్ టారిఫ్, బీ, సీ సెంటర్లలో టికెట్ రేట్లు, ఇతర సమస్యలపై చర్చలు జరిపారు. తనకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆహ్వానం గురించి చిరంజీవి సినీ ప్రముఖలకు వివరించారు. ప్రభుత్వం నుంచి కావాల్సిన సాయం పైన వారి అభిప్రాయాలు సేకరించారు.సినీ ఇండస్ట్రీ కార్మికుల సమస్యల ను వివరించి వారికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు లభించేలా ఒప్పించాలని సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు అభిప్రాయ పడ్డారు.