వాయిస్ మెసేజీ : మోహన్ బాబు సంచలన కామెంట్స్

Mohanbabu Sensational Comments. ‘మా’ ఎన్నికల విషయంలో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య పోటీ తారా స్థాయికి చేరుకుంది

By M.S.R  Published on  9 Oct 2021 4:27 PM IST
వాయిస్ మెసేజీ : మోహన్ బాబు సంచలన కామెంట్స్

'మా' ఎన్నికల విషయంలో ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ప్యానెళ్ల మధ్య పోటీ తారా స్థాయికి చేరుకుంది. ఇక మంచు విష్ణు ప్యానెల్‌ విజయం కోసం ఆయన తండ్రి మోహన్‌ బాబు రంగంలోకి దిగారు. ఎన్నికల్లో విష్ణుకే ఓటు వేయాలని 'మా' సభ్యులకు వాయిస్‌ మెస్సేజ్‌ పంపారు. 'తెలుగు వాళ్లు ఒకటిగా ఉండాలనే 'మా' ఏర్పాటు చేశారని.. ప్రస్తుతం 'మా' ఎన్నికల పరిస్థితి చూస్తే మనసుకు కష్టంగా ఉందని అన్నారు. ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని పెద్దలు అనేవారు. అయితే, కొంతమంది సభ్యులు రోడ్డునపడి నవ్వులపాలవుతున్నారు. ఎవరు ఏం చేసినా 'మా' అనేది ఒక కుటుంబం. విష్ణు గెలిచాక రెండు రాష్ట్రాల సీఎంలను కలుస్తాం. సినీ పరిశ్రమ కష్టాలను వారికి చెప్పుకుందాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను విష్ణు నెరవేరుస్తాడనే నమ్మకం ఉంది. విష్ణు మీ కుటుంబ సభ్యుడు. ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి ఓటు వేయండి' అంటూ వాయిస్‌ మెస్సేజ్‌లో సభ్యులను కోరారు.

అంతకు ముందు మోహన్ బాబు ఓ లేఖను రాసిన సంగతి తెలిసిందే. 'నేను మీ అందరిలో ఒకడిని. ఇండస్ట్రీలో కష్టం వచ్చిన ప్రతి సారి నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన దివంగత దర్శకుడు దాసరి నారాయణ గారి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన బిడ్డను. మీలో ఒకడిని. నిర్మాతలతో పాటు నిర్మాతని, నటులతో పాటు నటుడిని, దర్శక శాఖలో పని చేసిన వాడిని.. చేసిన సాయం, ఇచ్చిన దానం ఎప్పటికీ చెప్పొద్దంటారు. కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ సంస్థని స్థాపించిన రోజు నుంచి నేటి వరకు ఎన్నో చిత్రాలను నిర్మించి.. ఎందరో టెక్నిషియన్లను, కళాకారులను ఇండస్ట్రికీ పరిచయం చేశాను. 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న ఎంతోమంది పిల్లలకి మరణించిన సినీ కళాకారుల పిల్లలకి మన విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించి వాళ్లు గొప్ప స్థాయికి చేరేలా చేశాను. భవిష్యత్తులో కూడా దాన్ని కొనసాగిస్తాను కూడా.

ఇక 'మా' అధ్యక్ష పదవిలో నేను ఉన్నప్పుడే వృద్ధాప్య పింఛన్లని ప్రవేశపెట్టాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. 'మా' అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు, అదొక బాధ్యత. ఈసారి ఎన్నికల్లో నా కుమారుడు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. నా బిడ్డ నా క్రమశిక్షణకి, నా కమిట్‌మెంట్‌కి వారసుడు. తను ఇక్కడే ఉంటాడు. ఈ ఊళ్లోనే ఉంటాడు. ఏ సమస్య వచ్చినా మీ పక్కనే ఉంటాడని నేను మాటిస్తున్నా. మీరు మీ ఓటుని విష్ణుతో పాటు పూర్తి ప్యానల్‌కు వేసి సమర్థవంతమైన పాలనకి సహరించాలని మనవి' అని లెటర్ రాశారు.


Next Story