మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఫిలింనగర్ లో అదో రకమైన వాతావరణం నెలకొంటుంది. కలిసి మెలిసి ఉన్న సినీ తారలు కాస్తా గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. ఈ సారి అధ్యక్ష పదవికి పోటీలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. తాజాగా మోహన్ బాబు మా బిల్డింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 'మా'భవనం కోసం రూపాయికి కొన్న స్థలాన్ని అర్థ రూపాయికి అమ్మేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం జరిగిన 'మా' అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోహన్ బాబు మాట్లాడుతూ.. మా భవనం కోసం స్థలం కొని మళ్లీ అమ్మేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బిల్డింగ్ కోసం కూడబెట్టిన డబ్బుతో స్థలం కొని దాన్ని సగం ధరకు అమ్మడంపై పెద్దలు ఆలోచించాలని కోరారు. అతి త్వరలో మా ఎన్నికలు పెడతారని భావిస్తున్నానని చెప్పిన మోహన్ బాబు... దీనిపై అభిప్రాయాలు తీసుకుని కృష్ణం రాజు నిర్ణయం తీసుకుంటారని అన్నారు. వర్చువల్ పద్దతిలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు సర్వసభ్య సమావేశం జరిగింది. రెండేళ్లలో జమ ఖర్చులు, మా సభ్యుల సంక్షేమ కార్యక్రమాలు, మా ఎన్నికల నిర్వహణ పై చర్చ నిర్వహించారు.