అనంతపురానికి రానున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎందుకంటే
Mega star Chiranjeevi is going to Anantapur. మెగాస్టార్ చిరంజీవి ఈనెల 28న అనంతపురం నగరంలో సందడి చేయనున్నారు.
By Medi Samrat Published on 25 Sept 2022 2:50 PM ISTమెగాస్టార్ చిరంజీవి ఈనెల 28న అనంతపురం నగరంలో సందడి చేయనున్నారు. చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా ఈవెంట్‌ను అనంతపురం నగరంలో నిర్వహించనున్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఈ వేడుకకు వేదిక అవ్వనుంది. గాడ్ ఫాదర్ ఈవెంట్ అనంతపురం జిల్లాలో ఉంటుందని వారం రోజులుగా జిల్లాలో చర్చ నడుస్తోంది. అధికారికంగా నిర్ధారణ కావడంతో జిల్లాలోని మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నెల 27, 28 తేదీల్లో గాడ్ ఫాదర్ ఈవెంట్ నిర్వహిస్తారు. క్లాక్ టవర్ వద్ద ఉన్న ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌ను వినియోగించుకునేందుకు కళాశాల ప్రిన్సిపాల్ నుంచి అనుమతి పొందారు. 27వ తేదీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఏర్పాటు చేస్తారు. 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు చిరంజీవి, పలువురు సినీ ప్రముఖులు అనంతపురానికి రానున్నారు. ఇటీవలి కాలంలో పలు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు హైదరాబాద్ నగరంలో కాకుండా.. తెలుగు రాష్ట్రాల లోని ఇతర ప్రాంతాలలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు అనంతపురంలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగడం విశేషం.
చిరంజీవి కథానాయకుడిగా నటించిన గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చిరు,సల్మాన్‌లపై `తార్ మార్ తక్కెడమార్` అనే పాట రూపొందించారు.ముంబైలో ప్రభుదేవా డైరెక్షన్ లో ఈ పాటని చిత్రీకరించారు. నయనతార, సత్య దేవ్, సునీల్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ పతాకాలపై ఆర్.బి.చౌదరి, ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ కళా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నీరవ్ షా కెమెరా మెన్ గా పని చేశారు. 'గాడ్ ఫాదర్' చిత్రాన్ని 2022 దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నారు.