'మా' అధ్యక్షుడిగా ఆరునెలలు పూర్తిచేసుకున్న మంచు విష్ణు
Manchu Vishnu Completed Six Months As Maa President. నటుడు, నిర్మాత మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలలోకి అడుగుపెట్టి ఆరు నెలలు పూర్తయ్యాయి
By Medi Samrat Published on 20 April 2022 1:05 PM GMTనటుడు, నిర్మాత మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలలోకి అడుగుపెట్టి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఆర్నెల్ల కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో "మా" పోషించే పాత్రలో పలు మార్పులను తీసుకొచ్చారు. అర్హత గల కళాకారులకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించారు, ఈ పెన్షన్ పథకం పారదర్శకంగా ప్రారంభించగా.. దీనిని ఎప్పటికప్పుడు నిశితమైన పేపర్‌వర్క్‌తో పరిశీలిస్తారు. పరిశ్రమలోని వృద్ధ కళాకారులను వారి అంత్యకాలంలో జాగ్రత్తగా చూసుకోవాలనే ఆలోచనతో దీనిని ప్రారంభించారు.
వెబ్ ప్రపంచంలో అందుబాటులో ఉండేలా విష్ణు మంచు డిజిటల్ టెక్నాలజీని కూడా ప్రారంభించారు. ఇందులో భాగంగా www.maa.asia పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ ఇప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం వంటి సోషల్ మీడియా హ్యాండిల్‌లలో కూడా అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా సినీరంగంలోని కళాకారుల డేటాను మొత్తం సమీకరించి, వివిధ నిర్మాణ సంస్థలలో ఉన్న అవకాశాలను వారికి తెలియజేసే వారధిగా ఉండేలా.. ఓ ప్రత్యేకమైన యాప్‌ను కూడా రూపొందిస్తున్నారు. యువకుడిగా, ముందస్తు ఆలోచనలు గల అధ్యక్షునిగా సంస్థ భవిష్యత్ అవకాశాలు, టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని, సంస్థ కార్యాచరణలు ఉంటాయని మంచు విష్ణు నిర్ధారించారు.
ప్రస్తుత పరిస్థితులలో, ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అనేది ప్రాథమిక పరిగణన అంశంగా మారింది. దానిని దృష్టిలో ఉంచుకుని, సంస్థలోని సభ్య కళాకారులకు ఆరోగ్య బీమా పథకాలు అందించబడ్డాయి. సభ్యులు తక్కువ ధరలకే సహేతుకంగా వైద్య చికిత్స పొందగలిగేలా, హాస్పిటల్స్, మెడికల్ ఫెసిలిటీస్‌తో సంస్థ జట్టు కట్టింది. ఆరోగ్యంతో పాటు విద్యపై కూడా శ్రద్ధ చూపుతున్నారు. "మా" సభ్యుల పిల్లలకు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో స్కాలర్‌షిప్ పథకాలు కూడా ప్రవేశపెట్టారు. ప్రతి నిర్మాణ సంస్థలోను, అలాగే ప్రతి సెట్‌లోను మహిళలకు సురక్షితమైన పని వాతావారణాన్ని కల్పించడంలో సహాయం చేసేందుకు సునీతా కృష్ణన్ మార్గదర్శకత్వంలో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
తాను సాధించిన విజయాల గురించి విష్ణు మంచు మాట్లాడుతూ.. గత నాలుగు దశాబ్దాల కాలంలో నా కుటుంబానికి, నాకు ఎంతో అందించిన ఈ పరిశ్రమ కోసం.. నేను ఎంతో చేయాలని అనుకుంటున్నాను. మేము అందరం ఇక్కడ ఎంతో అభివృద్ధి సాధించాము, ఇంకా కళాకారులకు సేవ చేయడం ద్వారా, ఆ రుణాన్ని తిరిగి చెల్లించాలని నేను భావిస్తున్నాను. పదవీ కాలంలో పరిశ్రమతో సంబంధం గల ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే విధంగా సేవ చేయడమే నా విజన్-మిషన్ అని అన్నారు.