'కాంతారా' సినిమాలోని ఆ పాటపై ఆంక్షలు
Kantara Movie Song In Copyright Dispute. ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ సినిమాలోని ‘వరాహరూపం దైవ వరిష్టం’ అనే పాటపై
By Medi Samrat Published on 29 Oct 2022 12:15 PM GMTఇటీవల విడుదలైన కన్నడ చిత్రం 'కాంతార' సినిమాలోని 'వరాహరూపం దైవ వరిష్టం' అనే పాటపై కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు నిషేధం విధించింది. అనుమతి లేకుండా ఈ పాటను ఎక్కడా ప్రదర్శించరాదని ఆదేశించింది. 'వరాహరూపం దైవ వరిష్టం' పాటని కాపీ కొట్టారంటూ ఇటీవల కేరళకు చెందిన మ్యూజిక్‌బ్యాండ్ తైక్కుడం బ్రిడ్జ్ ఆరోపించింది. తమ బృందం రూపొందించిన 'నవరసం' అనే పాటను కాపీ కొట్టి 'వరాహరూపం..' పాటను కంపోజ్ చేశారంటూ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. తైక్కుడం బ్రిడ్జ్ అనుమతి లేకుండా ఈ పాటను థియేటర్, ఓటీటీ, యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కడా ప్రదర్శించరాదని తెలిపింది. ఈ విషయాన్ని తైక్కుడం బ్రిడ్జ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. పలు భాషల్లోనూ డబ్ అయి.. భారీ విజయాన్ని అందుకుంది.
అసలు వివాదం :
ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ 'తైక్కుడం బ్రిడ్జ్' ఐదేళ్ల క్రితం 'నవసరం' అనే పాటను కంపోజ్ చేసింది. చాలా మంది నెటిజన్లు కాంతారాకు చెందిన ప్రసిద్ధ ట్రాక్ 'వరాహ రూపం' 5 సంవత్సరాల నాటి కంపోజిషన్‌ను పోలి ఉందని కనుగొన్నారు. టీమ్ తైక్కుడం బ్రిడ్జ్ సోషల్ మీడియాలో విమర్శలు చేసింది. అంజనీష్ లోక్‌నాథ్ తమ ట్యూన్‌ను కాపీ చేసి.. తమకు క్రెడిట్స్ ఇవ్వలేదని విమర్శించింది. తమ సాంగ్ ను దొంగిలించినందుకు కాంతారా నిర్మాతలపై కేసు నమోదు చేయబోతున్నామని.. తమకు మద్దతు ఇవ్వాలని నెటిజన్లను కోరారు.