కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతారా' భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రిషబ్ శెట్టి రచన, దర్శకత్వమే కాకుండా అద్భుతమైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. ఇప్పటికీ హౌస్ ఫుల్స్ నడుస్తూ ఉంది ఈ సినిమా..! అయితే ఈ సినిమాను వివాదాలు కూడా వెంటాడుతూ ఉన్నాయి. కొందరు ఈ సినిమాను హిందువులకు వ్యతిరేకం అని కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు సినిమాకు సంబంధించి కాపీరైట్ ఇష్యులు కూడా నడుస్తూ ఉన్నాయి.
ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్ 'తైక్కుడం బ్రిడ్జ్' ఐదేళ్ల క్రితం 'నవసరం' అనే పాటను కంపోజ్ చేసింది. చాలా మంది నెటిజన్లు కాంతారాకు చెందిన ప్రసిద్ధ ట్రాక్ 'వరాహ రూపం' 5 సంవత్సరాల నాటి కంపోజిషన్‌ను పోలి ఉందని కనుగొన్నారు. టీమ్ తైక్కుడం బ్రిడ్జ్ సోషల్ మీడియాలో విమర్శలు చేసింది. అంజనీష్ లోక్‌నాథ్ తమ ట్యూన్‌ను కాపీ చేసి.. తమకు క్రెడిట్స్ ఇవ్వలేదని విమర్శించింది. తమ సాంగ్ ను దొంగిలించినందుకు కాంతారా నిర్మాతలపై కేసు నమోదు చేయబోతున్నామని.. తమకు మద్దతు ఇవ్వాలని నెటిజన్లను కోరారు. ఈ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ అంజనీష్ లోక్‌నాథ్‌ను ప్రశ్నించగా, తాను నవసరం ట్రాక్‌తో స్ఫూర్తి పొందానని, అయితే దానిని కాపీ చేయలేదని చెప్పుకొచ్చారు.