నటుడు సోనూ సూద్‌పై ఐటీ శాఖ చూపు సారించింది. ఆయనకు సంబంధించిన ఆరు నివాసాల్లో తనిఖీలు చేసినట్టు తెలుస్తోంది. సోనూ సూద్‌కు చెందిన ముంబైలోని వివిధ నివాసాలు, కార్యాలయాల వద్ద ప్రస్తుతం సర్వే కొనసాగుతోంది. ఆయనకు సంబంధించిన అకౌంట్స్ బుక్స్‌లో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ఐటీ శాఖ ఈ చర్యలు చేపట్టినట్టు చెబుతున్నారు. కొన్ని నెలల క్రితం, ముంబై మున్సిపల్ అధికారులు కూడా సోనూపై కంప్లైంట్ నమోదు చేశారు. ఆయన ఆరు అంతస్థుల నివాస భవనాన్ని తగిన అనుమతులు లేకుండానే హోటల్‌గా మార్చాడంటూ ఆరోపించారు.

కరోనా వైరస్ మహమ్మారి ప్రబలిన సమయంలో దేశం మొత్తం లాక్ డౌన్‌లో ఉండగా ఎందరో వలస కార్మికులకు సహాయం చేశాడు. 2020 ఏప్రిల్ తర్వాత నుంచి సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు దేశం మొత్తం ఫిదా అయిపోయింది. తాము కష్టాల్లో ఉన్నామంటూ ట్వీట్లు చేసిన ఎందరికో సాయంచేశాడు. కొందరికి లక్షలు ఖర్చు పెట్టి ట్రాక్టర్లు కొనిచ్చాడు. వేలాది రూపాయలతో పిల్లలు చదువుకోవడానికి సెల్ ఫోన్లు కొనిచ్చాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సోనూ సూద్ చాలా సేవా కార్యక్రమాలు చేశాడు.

ఏపీలోని కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయించాడు. చాలా మందికి ఆర్థికంగా సాయం చేశాడు. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని 'దేశ్‌ కే మెంటార్స్' కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌ సోనూసూద్‌ ఇటీవల నియమితులైన సంగతి తెలిసిందే. దానికింద పాఠశాల విద్యార్థులకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ నియామకం జరిగిన కొద్ది రోజులకే సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.


సామ్రాట్

Next Story