నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా.. సూపర్ హిట్ సాంగ్ వెనకున్న వ్యక్తులెవరు..?
History Behind Bullettu Bandi Song. 'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా...' పాట ఇప్పుడు ఎంతగా వైరల్ అవుతోందో ప్రత్యేకంగా
By Medi Samrat Published on 25 Aug 2021 4:59 PM IST'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా...' పాట ఇప్పుడు ఎంతగా వైరల్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రతి పెళ్లి బారాత్ లోనూ, సంగీత్ ఫంక్షన్స్ లోనూ ఇదే పాట వినిపిస్తోంది. ఈ పాట వచ్చి చాలా రోజులే అయినా.. మళ్లీ ఇప్పుడు క్రేజ్ రావడానికి కారణం సాయిశ్రీయ అనే అమ్మాయి. తన పెళ్లి బరాత్‌లో ఈ పాటకు ఆమె చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
సింగర్ మోహనా భోగరాజు ఈ పాటను పాడింది. లక్ష్మణ్(మహబూబ్‌నగర్) కలం నుంచి జాలువారిన ఈ పాటకు ఎస్‌కే బాజి సంగీతం అందించగా.. తెలంగాణ స్లాంగ్‌లో అద్భుతంగా ఆలపించింది మోహనా భోగరాజు. 'బుల్లెట్ బండి'సాంగ్ వైరల్ అయ్యాక ఈ పాట పాడింది ఎవరు? ఆమె నేపథ్యం ఏంటని ఆరా తీసి.. మోహన భోగరాజు గురించి తెలుసుకుంటున్నారు. ఆమె పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. ఆమె తల్లికి సంగీతమంటే ఎంతో ఇష్టం కావడంతో.. మోహనకు కూడా సంగీతం చిన్నప్పుటి నుంచే ఇష్టం ఏర్పడింది. పలు సంగీత పోటీలలో ఆమె పాల్గొంది.
ఓ కాంపిటీషన్ కు వెళ్లిన మోహన వాయిస్‌ని మ్యూజిక్ డైరెక్టర్ బాలాజీ విని ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన 'జైశ్రీరామ్' సినిమాలోలో అవకాశం ఇప్పించాడు. అందులో 'సయ్యామమాసం మనదేలే'అనే పాటను పాడింది. ఈ పాట పాడిన తరువాత కూడా ఆమె పలు సినిమాలకు కోరస్ గా పాడింది. 'భలే భలే మగాడివోయ్' టైటిల్ సాంగ్, 'బాహుబలి-2'లోని 'ఓరోరి రాజా'(తమిళ వెర్షన్) పాటలను పాడింది. అరవింద సమేత వీర రాఘవ (2019) చిత్రంలోని 'రెడ్డమ్మ తల్లి'పాటకు మోహనపై ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాదు ఈ పాట పాడినందుకు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు మోహన భోగరాజు నామినేట్ అయ్యింది. వకీల్ సాబ్‌లోని 'మగువా మగువా' ఫిమేల్ వెర్షన్ పాడింది ఈ భామనే. వీటితో 'సైజ్ జీరో', 'అఖిల్', 'సోగ్గాడే చిన్నినాయనా', 'ఇజం', 'శతమానం భవతి', 'జవాన్', 'భాగమతి', 'సవ్యసాచి', 'బ్లఫ్ మాస్టర్', 'ఎన్టీఆర్ బయోపిక్', 'ఓ బేబీ', 'వెంకీమామ', 'హిట్' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో మోహన పాటలు పాడింది.
'బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా'పాట నిర్మాతలు.. తమ తదుపరి పాటకు డ్యాన్స్ చేసే అవకాశం బారాత్ లో డాన్స్ చేసి పాటను పాపులర్ చేసిన సాయిశ్రీయకు కల్పించారు. 'బుల్లెట్ బండి' ఒరిజినల్ పాటను నిర్మించిన బ్లూ రాబిట్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సాయి శ్రీయకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ తదుపరి పాటలో నటించాలని ఆ సంస్థ అధినేత నిరూప సాయి శ్రీయను కోరింది. ఈ మేరకు ఆమె ఫోన్‌లో సాయిశ్రీయతో మాట్లాడినట్లు సమాచారం. అనుకోని ఈ ఆఫర్‌కు సాయి శ్రీయ కూడా ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా జన్నారంకు చెందిన అటవీ శాఖ ఉద్యోగి రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె సాయి శ్రీయ వివాహం ఈ నెల 14న జరిగింది.మంచిర్యాల జిల్లాకే చెందిన రామకృష్ణాపూర్ వాసి అశోక్‌తో ఆమె వివాహం జరిగింది. బరాత్ వేడుకలో సాయి శ్రీయ తన డ్యాన్స్‌తో భర్తను సర్‌ప్రైజ్ చేసింది.