తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన హీరో విజయ్

Hero Vijay Filed Case Against His Parents. హీరో విజయ్ తమిళనాడులోనే కాదు దక్షిణాదిన ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది.

By Medi Samrat  Published on  19 Sept 2021 5:00 PM IST
తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన హీరో విజయ్

హీరో విజయ్ తమిళనాడులోనే కాదు దక్షిణాదిన ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన ఇటీవలి కాలంలో సినిమాల పరంగా కాకుండా వేరే అంశాల పరంగా వార్తల్లో ఉన్నాడు. కొద్దిరోజుల కిందట తన రోల్స్ రాయిస్ కారుకు ట్యాక్స్ ఎగ్గొట్టిన వివాదం ఆయన్ను వెంటాడగా.. ఇప్పుడు ఏకంగా తల్లిదండ్రుల మీదనే కేసు పెట్టాడనే వార్త సంచలనమైంది. హీరో విజయ్ తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో ఆదివారం కేసు పెట్టడం తమిళనాడులో హాట్ టాపిక్ అయింది. అనుమతి లేకుండా తన పేరు వాడుకుంటున్నారని ఫిర్యాదులో విజయ్ చెప్పారు. తన పేరుతో ఎలాంటి కార్యక్రమాలు, మీటింగ్స్ నిర్వహించకుండా ఉండేందుకే విజయ్ ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 27న దీనిపై విచారణ జరగనుంది.

ఏడాది క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్​ఏ చంద్రశేఖర్ 'ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్' పేరుతో రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే..! ఆ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ సమయంలో విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం మొదలైంది. ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్ పార్టీకి విజయ్ తండ్రి చంద్రశేఖర్ జనరల్ సెక్రటరీగా, శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. పార్టీ పెట్టిన కొన్నిరోజులకే విజయ్ ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. "మా నాన్న పెట్టిన పార్టీతో నేరుగా, పరోక్షంగా గానీ నాకు సంబంధం లేదు. మా నాన్న పార్టీ పెట్టారని నా ఫ్యాన్స్ ఎవరూ అందులో చేరొద్దు" అని విజయ్ తన నోట్​లో చెప్పారు. పార్టీ కోసం తన పేరు, ఫొటో, ఫ్యాన్స్​ క్లబ్​ను గానీ దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని కూడా విజయ్ తెలిపారు.

ఇప్పుడు ఏకంగా కోర్టులో విజయ్ సివిల్ కేసు వేశారు. విజయ్ తన తల్లిదండ్రులు సహా మొత్తం 11 మంది, ఇక పై తన పేరుని వాడుకోకుండా, కోర్టుని ఆశ్రయించారు. ఇళయ దళపతి ఫ్యాన్స్‌కు చెందిన ఓ రిజిస్టర్డ్ సొసైటీకి స్థానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఆయన తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. దాంతో కొందరు తాము విజయ్ అభిమానులమంటూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్నారు. సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా తన పేరు పొలిటికల్ మీటింగ్స్‌కి వాడుకోవటంపై అభ్యంతరం తెలియజేస్తూ విజయ్ కోర్టును ఆశ్రయించారు.


Next Story