రేపటి నుంచి థియేటర్లు ఓపెన్
Cinema Theatres Open From Tomorrow. తెలంగాణలో కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. మూతపడ్డ థియేటర్లను
By Medi Samrat Published on 17 July 2021 7:32 PM ISTతెలంగాణలో కరోనా కారణంగా థియేటర్లు మూతపడ్డ విషయం తెలిసిందే. మూతపడ్డ థియేటర్లను ఆదివారం నుంచి తెరవాలని రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది. లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో.. ఎగ్జిబిటర్లు పలుమార్లు తమ బాధలను ప్రభుత్వానికి విన్నవించారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లి వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావడంతో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు తెరవాలని తెలంగాణ ఫిల్మ్ చాంబర్, థియేటర్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంయుక్తంగా నిర్ణయం తీసుకుంది.
ఎగ్జిబిటర్లు ఎవరైనా రేపటి నుంచి సినిమాలను ప్రదర్శించుకోవచ్చని, ఈ నెల 23 నుంచి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న దృష్ట్యా థియేటర్లు తెరుచుకోవచ్చని అసోసియేషన్ సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే 100 శాతం సీట్ల సామర్థ్యంతో అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. రేపటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగించాలని తీర్మానించినట్లు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కార్యదర్శి విజయేందర్ రెడ్డి తెలిపారు. అలాగే.. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రభుత్వానికి కొన్ని వినతులు చేసింది. జీఎస్‌టీ తగ్గింపు, పార్కింగ్ రుసుము వసూలు, విద్యుత్తు ఛార్జీల తగ్గింపు, మున్సిపల్/ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరింది.