తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల నటుడు చిరంజీవి సంతాపం ప్రకటించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆస్పత్రిలో చేరేముందు ఆయనతో మాట్లాడానని చిరంజీవి తెలిపారు. సిరివెన్నెల ఆరోగ్యం బాగోలేదని తెలిసి.. మద్రాసులో ఓ మంచి హాస్పిటల్ ఉందని.. అక్కడకు ఇద్దరం కలిసి వెళ్దామని అనుకున్నామని తెలిపారు. అయితే.. సిరివెన్నెల బదులిస్తూ.. మిత్రమా.. ఈ రోజు ఇక్కడ జాయిన్ అవుతా. నెలాఖరులోపు వచ్చేస్తా. అప్పటికీ ఉపశమనం పొందకపోతే నువ్వు చెప్పినట్టుగానే అక్కడి వెళ్దాం అని అన్నారని సిరివెన్నెలతో జరిగిన సంభాషణను చిరంజీవి వివరించారు.
అలా వచ్చేస్తానని వెళ్లిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారని ఊహించలేదని చిరంజీవి బాధాతప్తహృదయంతో మాట్లాడారు. సిరివెన్నెల మరణం బాధాకరమైన విషయమని.. ఆయనకు అన్ని రకాల మెరుగైన వైద్యం అందివ్వాలనే ఉద్దేశంతో ఆరోజు ఆయనకు ఫోన్ చేస్తే ఎంతో హుషారుగా మాట్లాడారని.. అంత ఉత్సాహంగా దాదాపు 20 నిమిషాలపాటు మాట్లాడటంతో కచ్చితంగా ఆయనకు ఏం జరగదని అనుకున్నానని చిరంజీవి అన్నారు. సిరివెన్నెల, నేనూ ఒకే వయసు వాళ్లమని.. ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా మిత్రమా అంటూ పలకరించేవారని ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.