పవన్ సినిమాకు చిరంజీవి టైటిల్
Chiranjeevi Movie Title For Pawan Movie. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కూడా దూకుడును చూపిస్తూ ఉన్నాడు.
By Medi Samrat
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో కూడా దూకుడును చూపిస్తూ ఉన్నాడు. 'వకీల్ సాబ్' చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు పవన్. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. దీని తర్వాత వరుస సినిమాలు చేయనున్నారు. 'వకిల్ సాబ్' తరువాత చేయబోయే సినిమాకు సంబంధించి క్లారిటీ వచ్చేసింది. మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పనుమ్ కోషియమ్`ను సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ తెలుగులోకి రీమేక్ చేస్తోంది.
సాగర్ కె. చంద్ర ఈ సినిమాకు దర్శకుడు వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్‌తోపాటు దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు. దానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం ఇటీవలే విడుదల చేసింది.మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దాంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చెయ్యడానికి భారీ మొత్తం చెల్లించి హక్కులు తీసుకున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్, బిజూమీనన్ పోషించిన ప్రధాన పాత్రలను తెలుగు వెర్షన్ లో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి పోషిస్తున్నారు.
పవన్ సరసన సాయిపల్లవి, రానా సరసన ఐశ్వర్య రాజేశ్ నాయికలుగా నటించే అవకాశం వుంది. ఇక చిత్రం టైటిల్ విషయానికి వస్తే.. 'బిల్లా రంగా' అనే పేరు బాగా వినిపిస్తోంది. చిత్రకథకు ఇది సరైన టైటిల్ అవుతుందని భావిస్తున్నారట. 1982లో 'బిల్లా రంగా' పేరుతో వచ్చిన సినిమాలో చిరంజీవి, మోహన్ బాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కేఎస్ఆర్ దాస్ దర్శకత్వం వహించారు. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా అప్పట్లో అది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అదే సినిమా టైటిల్ ను ఇప్పుడు పవన్-రానా సినిమా కోసం తీసుకునే అవకాశం ఉంది. ఈ టైటిల్ కు పవన్ కూడా ఓకే చెప్పినట్టు చెబుతున్నారు. దీంతో దాదాపు దీనినే ఫైనల్ చేస్తారని సమాచారం.