రాజమౌళిపై ఆయన కోపం ఏ మాత్రం తగ్గడం లేదు..!
Boney Kapoor accuses SS Rajamouli. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలు అంటే చాలు.. భారతదేశంలోని సినీ ప్రేమికులు
By Medi Samrat Published on 13 Feb 2021 3:01 PM GMT
దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలు అంటే చాలు.. భారతదేశంలోని సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆర్.ఆర్.ఆర్. సినిమా విషయంలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. ఆ రిలీజ్ డేట్ విషయంలో శ్రీదేవి భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఆగ్రహంతో ఉన్నారు. బోనీకపూర్ అజయ్ దేవగణ్ హీరోగా నిర్మిస్తున్న 'మైదాన్' చిత్రాన్ని అక్టోబర్ 15న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రాజమౌళి కూడా అందుకు రెండు రోజుల ముందే 'ఆర్ఆర్ఆర్' సినిమాను విడుదల చేస్తుండడం పట్ల బోనీకపూర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే విషయాన్ని మరోసారి బోనీకపూర్ చెప్పుకొచ్చారు. ఒకే నెలలో రెండు రోజుల తేడాతో ఒకే హీరో నటించిన సినిమాలను విడుదల చేయడం దురదృష్టకరమని.. ఆర్‌ఆర్‌ఆర్ లో అజయ్ దేవ్‌గణ్ కీలకపాత్ర పోషిస్తున్నారని, తాను నిర్మాతగా వ్యవహరిస్తోన్న మైదాన్ లో అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని బోనీ కపూర్ చెప్పారు. ఈ సినిమాను గత ఏడాది విడుదల చేయాలనుకున్నామని, కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయిందని తెలిపారు. సినిమా కోసం తాము అనుకున్న దానికంటే భారీగానే ఖర్చుపెట్టామని తెలిపారు. మళ్లీ సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలోనే తాము మైదాన్ విడుదల తేదీని ప్రకటించామని తెలిపారు.
తాము ఆ ప్రకటన చేసిన కొన్ని రోజులకే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల ప్రకటన వచ్చిందని చెప్పారు. ఇది అనైతికమైన చర్య అని.. ఈ విషయంపై ఇటీవల రాజమౌళితో ఫోన్‌లో మాట్లాడగా.. విడుదల తేదీతో తనకు సంబంధం లేదని చెప్పారని అన్నారు. అది నిర్మాతల ఇష్టప్రకారం జరిగిందని ఆయన అన్నారని, ఆయన మాటలను తాను నమ్మాలనుకోవడం లేదని చెప్పారు. ఆ సినిమా విడుదల గురించి అజయ్ దేవగణ్ కూ ముందుగా చెప్పి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.