కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్‌డౌన్ ప్రకటించిన సమయంలో ఎంతో మంది వలస కూలీలకు తమ వంతు సాయం అందించి ప్రత్యేక వాహానాలను ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు పంపించి రియల్ హీరో అనిపించుకున్నాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. రీల్‌లైఫ్ లో విలన్ గా కనిపించిన సోనూసూద్ గొప్పమనసుకు అందరూ సెల్యూట్ చేశారు. తన చిన్ననాటి ఫ్రెండ్ నీతిగోయెల్ తో కలిసి ఘర్ భేజో క్యాంపెయిన్ ను షురూ చేసి 7.5లక్షలకు పైగా వలస కార్మికులకు రవాణా, ఆహారం, మెడికల్, ఇతర సదుపాయాలను కల్పించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాడు.
విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. అంతే కాకుండా కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేసాడు. వలస కూలీల పాలిట దేవుడిలా మారిన సోనూసూద్‌కు అవార్డులు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ రియల్ హీరోకు పర్సన్ ఆఫ్ ది ఇయర్-2020 అవార్డును యూఎన్‌డీపీ ప్రకటించింది. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సోనూ సేవలకు గానూ ఈ స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించింది.