సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి, దర్శకురాలు, నిర్మాత జయచిత్ర భర్త గణేష్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 62 సంవత్సరాలు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో శుక్రవారం ఉదయం గణేష్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. గణేష్ పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం పోయెస్ గార్డెన్‌లో ఉంచారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు నటి కుటుంబ సభ్యులు తెలిపారు.
తెలుగు, తమిళ బాషల్లో అనేక చిత్రాల్లో నటించి మేటి నటిగా.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుతెచ్చుకున్న జయచిత్ర తమిళనాడులోని కుంభకోణంకు చెందిన గణేష్‌తో 1983లో వివాహం జరిగింది. ఈ దంపతుల సంతానమే యువ సంగీత దర్శకుడు అమ్రేష్. గణేశ్ నటుడిగా ఓ చిత్రంలో నటించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖుు సంతాపం తెలియజేశారు. గణేష్‌ను కడసారి చూసేందుకు జయచిత్ర అభిమానులు భారీగా తరలివస్తున్నారు.
జయచిత్ర తెలుగునాట జన్మించినా.. తమిళనాడులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం బాషల్లో రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించింది. ఆమె తెలుగులో సోగ్గాడు, మా దైవం, ఆత్మీయుడు, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి పులి, ఘరానా బుల్లోడు, సమరసింహారెడ్డి వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.