టాలీవుడ్ నటుడు శివాజీ క్షమాపణలు చెప్పారు. నాలుగు మంచి మాటలు చెప్పాలని చేసిన ప్రయత్నంలో రెండు సరైన పదాలు మాట్లాడలేకపోయానని ఆ విషయంలో క్షమాపణలు చెబుతున్నానన్నారు. స్త్రీని తాను గౌరవిస్తానని, స్త్రీని తక్కువగా చూసే అవకాశం ఇవ్వకూడదని తాను చెప్పానన్నారు. మంచి చెప్పాలనే ఉద్దేశ్యం తప్ప కించపరచాలనే ఉద్దేశ్యం తనకు అసలు లేదన్నారు. తన వ్యాఖ్యల కారణంగా ఎవరైనా నొచ్చుకుని ఉంటే దయచేసి క్షమించాలని శివాజీ అన్నారు.
హైదరాబాద్‌లో 'దండోరా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ కొన్ని వ్యాఖ్యలు చేశారు." చీర కట్టుకుంటేనే అందం కానీ, సామాన్లు కనబడేలా బట్టలు వేసుకోవడం కాదు. పైకి ఎవరూ అనకపోయినా లోపల మాత్రం తిట్టుకుంటారు" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద స్పందించారు. శివాజీ వ్యాఖ్యలను తమ లీగల్ టీమ్ పరిశీలించిందని, ఆయనపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. సినిమా వేడుకల్లో మాట్లాడేటప్పుడు నటులు జాగ్రత్తగా ఉండాలని, మహిళలను అవమానించేలా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.